Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

పోరుబాట పోస్టర్లు, విడుదల

విశాలాంధ్ర- ఉరవకొండ : జగనన్న ఇళ్ళ నిర్మాణాలకు 5 లక్షల రూపాయలు ఇస్తూ కాలనీల్లో మౌళిక సదుపాయాలు కల్పించాలని, టిడ్కో ఇళ్ళను లబ్దిదారులకు తక్షణమే స్వాధీనం చెయ్యాలని సీపీఐ ఆధ్వర్యంలో జరగబోయే పోరుబాటకు సంబంధించిన పోస్టర్లు, కరపత్రాలను శుక్రవారం సిపిఐ పార్టీ నాయకులు స్థానిక సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివన్న, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, తాలూకా కార్యదర్శి మల్లికార్జున మాట్లాడుతూ పేద ప్రజల ఇళ్ళ నివేశస్థలాలు, నిర్మాణాలపట్ల సీఎం జగన్ నిర్లక్ష్య వైఖరిని వ్యతిరేకిస్తూ సీపీఐ, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో వైసీపీ ప్రభుత్వం పై పోరుబాట కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అందులో భాగంగా ఈ నెల 17 నుండి 30 వరకు జగనన్న ఇళ్ళు, మరియు టిడ్కో ఇళ్ళ లబ్దిదారులతో అర్జీలపై సంతకాలు సేకరిస్తామన్నారు.30 న మండలాలు, నియోజక వర్గ కేంద్రాలు,జిల్లా కేంద్రంలో బాధితులతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఫిబ్రవరి 6   న సదస్సులు నిర్వహించి జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులకు లబ్దిదారుల అర్జీలు,వినతి పత్రాలు అందజేస్తున్నామన్నారు.22 న విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా లబ్దిదారులందరితో కలసి మాహా ధర్నా చేపడుతున్నట్లు వారు తెలిపారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షలమందికి జగనన్న ఇళ్ళ పట్టాలు ఇచ్చారే గాని అవన్నీ నిరుపయోగంగా మారాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న లక్షా యాభై వేలకు రాష్ట్ర ప్రభుత్వం కేవలం 30 వేల రూపాయలు కలిపి మొత్తంగా ఒక లక్ష ఎనభైవేల రూపాయలు లబ్దిదారులకు ఇస్తోందని ఆ సొమ్ము ఇంటి నిర్మాణానికి ఏమాత్రం చాలదన్నారు. అనేక ప్రాంతాల్లో నిర్మాణాలు జరగడం లేదనిఆరోపించారు. నాలుగేళ్లుగా  ప్రభుత్వం ఇళ్ళు కట్టిన పాపాన పోలేదని పలు ప్రాంతాల్లో ఆయా స్థలాలను అమ్ముకుంటున్నారని  ఆరోపించారు.జగనన్న ఇంటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న సెంటు స్థలం పేద కుటుంబానికి చాలదని గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇంకా ఈ కార్యక్రమంలో పార్టీ తాలూకా సహాయ కార్యదర్శి మనోహర్, రైతు సంఘం జిల్లా నాయకులు గోపాల్, నాగరాజు, ఉరవకొండ కార్యదర్శి మల్లికార్జున, వజ్రకరూరు మండల కార్యదర్శి సుల్తాన్, విడపనకల్లు కార్యదర్శి రమేష్ స్థానిక నాయకులు మల్లేష్, గణప మల్లికార్జున,మల్లికార్జున గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img