Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో కొత్త వింత

విశాలాంధ్ర`అనంతపురం వైద్యం : కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆయుష్‌ శాఖకు ప్రత్యేక గుర్తింపు లభించే విధంగా ప్రజలకు అందుబాటులో ఆయుష్‌ శాఖకు సంబంధించి ఆయుర్వేదం, హోమియో, యూ నాని, నాచురోపతి మందుల ద్వారా దీర్ఘకాలిక రోగాలతో బాధపడుతున్న వారికి ఎటువంటి సైడ్‌ ఎఫెక్ట్‌ లేకుండా వైద్యుల సలహాలతో మందులను అందజేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఆయుష్‌ శాఖను పట్టించుకునే ఉన్నతాధికారులు కరువైనప్పుడు ప్రజలకు ఆయుష్‌ శాఖకు సంబంధించిన ఉచిత వైద్య సేవలు కనుమరుగవుతున్నాయి అని ప్రజలు అనుకుంటున్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలలో సిబ్బంది కొరతతో నిరసన తెలుపుతున్నట్లుగా వైద్యశాల ద్వారం ముందు గమనిక అంటూ రోగులకు తెలిసే విధంగా 1. ఈ వైద్యశాలలో పనిచేయుచున్న ఏకైక ఉద్యోగి సబ్బార్డినేట్‌ ఈ దినం సెలవు తీసుకుని ఉన్నందున ఈ దినము వైద్యశాల తెరవబడదు.మరి ఒక గమనిక సూచన 1. వైద్యుడు లేని రోజు రోగులకు మందులు ఇచ్చే అధికారం ఇక్కడ పనిచేయుచున్న ఏకైక ఉద్యోగి, ఆఫీస్‌ సబార్డినేటర్‌ లేనందున వైద్యుడు ఉన్న రోజే మాత్రమే రోగులకు మందు ఇవ్వబడును. 2. వైద్యుడు లేని రోజు, సబ్‌ ఆర్డినేటర్‌ సెలవుల్లో ఉన్న రోజు వైద్యశాల తెరవబడదు. ఇటువంటి సూచనలను చూసి అక్కడికి వస్తున్న రోగులు ఇది ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలన లేక ప్రైవేట్‌ ఆయుర్వేద వైద్యశాలన అంటూ ఆరోపిస్తున్నారు. ఈ విషయమై ఆయుష్‌ శాఖ కడప ఆర్‌ డి డి కుమార్‌ బాబు కు వివరణ కోరగా ఆయుష్‌ శాఖ కమిషనర్‌ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం ఆయుర్వేద వైద్యశాలలో వైద్యుల కొరత ఉండగా అనంత జిల్లా పట్టణంలో ఉన్న ప్రభుత్వ ఆయుర్వేద వైద్యశాలకు దగ్గరలో మండలాల్లో పనిచేస్తున్న ఆయుర్వేద వైద్యున్ని వారానికి మూడు రోజులపాటు సేవలను అందించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగిందన్నారు. కానీ ప్రభుత్వ ఆయుష్‌ శాఖ ఆదేశాల ప్రకారం వైద్యుడు ఉన్నా లేకపోయినా సోమవారం నుంచి శనివారం వరకు వైద్యశాలను తెరిచి ఉంచాలన్నారు. ప్రభుత్వ ఆయుష్‌ శాఖ నుంచి అనుమతి లేకుండా వారికి వారు సెలవు దినముగా ప్రకటించుకొని వైద్యశాలను మూసివేసే అధికారం వారికి లేదని తెలియజేశారు. అలా జరిగినట్లయితే వారిని వివరణ కోరుతూ వారిపై చర్యలు తీసుకునే అధికారం ఉన్నతాధికారులకు ఉంది అన్నారు. ఇటువంటి నిరసన ప్రకటనలు రాబోవు రోజుల్లో ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేస్తున్నటువంటి వైద్యులు రాకపోతే సబర్డినేటర్లు గమనిక అంటూ ఇటువంటి సూచనలు చేస్తూ వైద్యశాలలను వారికి వారుగా సెలవు ప్రకటిస్తూ మూసివేసే పరిస్థితి వస్తుందో ఏమో అని ప్రజలు అనుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ ఆయుష్‌ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారులు, ఆయుష్షును పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img