Thursday, April 25, 2024
Thursday, April 25, 2024

రక్తపోటు, చక్కెర స్థాయి.. ఈ రెండు అదుపులో ఉంచుకుంటే కిడ్నీలను కాపాడుకోవచ్చును..

డాక్టర్ ఎం.పావని
విశాలాంధ్ర -ధర్మవరం : మానవ శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలక పాత్ర అవుతుందని.. రక్తపోటు, చక్కెర వ్యాధి స్థాయిలు,, ఈ రెండు అదుపులో ఉంచుకుంటే కిడ్నీలను కాపాడుకునే అవకాశం ఉందని స్పందన హాస్పిటల్ డాక్టర్. పావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం అంతర్జాతీయ కిడ్నీ పరిరక్షణ దినోత్సవ సందర్భంగా పలు విషయాలను వారు వెల్లడించారు. అనంతరం వారు మాట్లాడుతూ రోజు వ్యాయామం చేస్తూ, మితాహారం తినడం వలన కిడ్నీలు ఆరోగ్యంగా పనిచేస్తాయని, శీతల పానీయాలకు వీలైనంత దూరంగా ఉండాలని, అన్నిటికీ మించి చీటికిమాటికి నొప్పి నివారణ మాత్రలు వాడకుండా ఉంటే చాలా మంచిదని వారు తెలిపారు. అదేవిధంగా జీవనశైలిలో మార్పులతో పాటు ఆహార నియమాలు పాటించకపోవడం వలన కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. కిడ్నీలు పూర్తిగా పాడైతే ప్రాణాలు దక్కకుండా పోతాయని, అందుకే ప్రాథమిక దశలోనే కిడ్నీల సమస్యలను గుర్తించి సరైన వైద్య చికిత్సను సంబంధిత డాక్టర్ తో వైద్య చికిత్సలు అందించుకోవాలని తెలిపారు. మూత్రపిండాలకు (కిడ్నీ) ముప్పు వాటిల్లక ముందే ప్రతి వ్యక్తి మేల్కొని ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇష్టం వచ్చినట్లు ఏది పడితే అది తినడం కూడా, అనారోగ్యానికి కారణం అవుతుందన్నారు. ఆహారములో స్వీయ నియంత్రణ లేకనే కిడ్నీ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, కిడ్నీలపై ప్రభావం బీపీ, షుగర్ కూడా చూపుతున్నట్లు వారు తెలిపారు. కీళ్ల నొప్పులు మోకాళ్ళ నొప్పులు తలనొప్పి కంటినొప్పి లాంటివి పెయిన్ కిల్లర్స్ వేసుకోవడం వల్ల కిడ్నీలపై మోయలేని భారం పడుతుందని, ఆ పెయిన్ కిల్లర్స్ కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమే ఇస్తుందని, దీర్ఘకాలిక ప్రమాదం కూడా కొని తెస్తాయని తెలిపారు. ఆకలి లేకపోవడం, నీళ్లు తాగిన మూత్రం సరిగా రాకపోవడం, అలసట, నీరసంగా ఉండడం, ముఖములో లేదా శరీరంలో వాపు, లేదా ఉబ్బరం కనిపించడం లాంటివి ప్రమాదానికి సంకేతాలని తెలిపారు. కిడ్నీలు పనిచేయకపోతే డయాలసిస్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. కిడ్నీ మార్పిడి అంటే సులువైన ప్రక్రియ కాదని తెలిపారు. కాబట్టి ప్రజలందరూ కిడ్నీని ఇబ్బంది పెట్టుకోకుండా తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందని తెలిపారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తాగునీటిని ప్రతిరోజు అధికంగా తీసుకోవాలని వారు తెలిపారు. కిడ్నీకి సంబంధించిన వ్యాధిగ్రస్తులు కిడ్నీ డాక్టర్లను సంప్రదించి తగిన వైద్య చికిత్సలను పొందాలని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img