Saturday, April 20, 2024
Saturday, April 20, 2024

రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత

విశాలాంధ్ర – పార్వతీపురం: రాష్ట్రంలో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు ఎం.వి.ఎస్ నాగిరెడ్డి అన్నారు. జిల్లా పర్యటనకు శని వారం విచ్చేసిన వ్యవసాయ మిషన్ ఉపాధ్యక్షులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జరిగిన వ్యవసాయ మరియు అనుబంధ రంగాల భాగస్వామ్య పక్షాల ముఖాముఖి చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు 20 జిల్లాల్లో పర్యటించామని, పార్వతీపురం మన్యం జిల్లా 21వ జిల్లా అన్నారు. వ్యవసాయ మిషన్ ఉన్నత స్థాయి సలహాలను ప్రభుత్వానికి అందిస్తుందని ఆయన చెప్పారు. ప్రత్యేక బాధ్యతతో ముఖ్య మంత్రి వ్యవసాయ మిషన్ ను ఏర్పాటు చేశారని తెలిపారు. ఇరుగుపొరుగు రాష్ట్రాల్లో జరగని కార్యక్రమాలు రాష్ట్రంలో జరుగుతుందని ఆయన వివరించారు. సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయం చేసే అవకాశం ఎక్కువగా ఉన్న ప్రాంతమని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రంలో వివిధ పథకాల క్రింద రైతులకు గత మూడు సంవత్సరాలలో రూ.25,975 కోట్లు చెల్లించడం జరిగిందని, వ్యవసాయ అనుబంధ శాఖల క్రింద రూ.85,096 కోట్లు చెల్లించడం జరిగిందని ఆయన వివరించారు. రైతులకు, ప్రభుత్వ యంత్రాంగానికి, ప్రజా ప్రతినిధులకు అత్యంత సాన్నిహిత్యం ఉండాలని తద్వారా సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయని ఆయన చెప్పారు. ధాన్యంలో నాణ్యత ఉంటే సమస్య ఉండదని ఆయన పేర్కొన్నారు. వ్యవసాయ విధానం కేంద్ర ప్రభుత్వం అధీనంలో ఉందని ఆయన తెలిపారు. వెయ్యి కోట్ల రూపాయల గత బకాయిల వలన బిందు సేద్యం పరికరాలను అందించడంలో జాప్యం జరిగిందని ఆయన వివరించారు. ఏడాదికి దాదాపు 70 వేల హెక్టార్లు ఉద్యాన పంటలకు మారుతోందని అన్నారు. గత మూడు సంవత్సరాలుగా ఆయిల్ పామ్, మామిడి, జీడి తదితర పంటలు ముందు వరుసలో ఉన్నాయని ఆయన వివరించారు. అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి పంటలను వేయాలని సూచించారు. చిరు ధాన్యాలను గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా పండిస్తున్నారని చెప్పారు. మార్కెట్ కల్పనకు ప్రాదాన్యత ఇవ్వడం జరుగుతుందని ఆయన వివరించారు. విలువ ఆధారితకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. పసుపు, టమాట, అరటికి కూడా మద్దతు ధరను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పారు. పామాయిల్, వెదురుకి మంచి మార్కెట్ ఉందని నాగిరెడ్డి అన్నారు. గిరిజన ప్రాంతాల్లో 50 గిడ్డంగుల మంజూరుకు ప్రతిపాదన ఉందని ఆయన తెలిపారు. రైతులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. రైతులు పాడిపంట కలిగి ఉండాలని ఆయన చెప్పారు. ఇంటికి ఒక దేశీయ ఆవు ఉండాలని ఆయన అన్నారు. వ్యవసాయం సమస్యలలో లేదని ఆయన చెప్పారు. పిల్లల్లో భూమిపై ఆపేక్షను పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 90 శాతం మందికి నవరత్నాలు అందుతున్నాయని నాగిరెడ్డి చెప్పారు. సమసమాజం స్థాపన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. దేశంలోనే అత్యధికంగా ఇళ్ళు మంజూరు జరిగిందని ఆయన చెప్పారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న ఇ క్రాప్ విధానం, గ్రామ – వార్డు సచివాలయ వ్యవస్థను దేశంలో అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జిల్లాలో సమస్యలు ఉంటే వ్రాతపూర్వకంగా తెలియజేయాలని ఆయన సూచించారు.
అరకు పార్లమెంటు సభ్యులు గొడ్డేటి మాధవి మాట్లాడుతూ స్థానిక రైతులకు ఆయిల్ పామ్ పట్ల పూర్తి అవగాహన కల్పించాలని కోరారు.
శాసన మండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ జిల్లాలో ప్రధాన జీవనాధారం వ్యవసాయమన్నారు. వలసలు ఎక్కువగా వెళ్లే జిల్లాల్లో ఒకటని, ఇకెవైసి విషయంలో కొంత వెసులుబాటు కల్పించాలని సూచించారు. పంట మార్పిడి విధానంలో భాగంగా చెరకు సాగుకు ప్రభుత్వం కొంత ప్రోత్సాహకం అందించాలని కోరారు. తద్వారా వరి పంట నుండి ఇతర పంటలకు మారగలరని చెప్పారు.
పాలకొండ శాసన సభ్యులు విశ్వసరాయి కళావతి మాట్లాడుతూ పాలకొండ ప్రాంతంలో ధాన్యం కొనుగోలుపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. మైదాన ప్రాంత గిరిజనులకు కూడా 90 శాతం రాయితీతో విత్తనాలు అందించాలని సూచించారు. భామినిలో పత్తికి గిడ్డంగి సౌకర్యం కల్పించాలని ఆమె కోరారు. ఏనుగుల సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని కోరారు. పార్వతీపురం శాసన సభ్యులు అలజంగి జోగారావు మాట్లాడుతూ ధాన్యం విక్రయంలో రైతులు ఏ మాత్రం అధైర్యపడవద్దని సూచించారు. జిల్లా వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు వాకాడ నాగేశ్వర రావు మాట్లాడుతూ జిల్లాకు కావలసిన వనరులు సమకూర్చాలని అన్నారు. జిల్లాలో శత శాతం ఇ క్రాప్ చేయడం జరిగిందని తెలిపారు. దళారీలను రైతులు ఆశ్రయించ వద్దని కోరారు. జాయింట్ కలెక్టర్ ఓ.ఆనంద్ మాట్లాడుతూ పార్వతీపురం మన్యం జిల్లా వరి పండించే జిల్లాల్లో ముందు వరుసలో ఉందన్నారు. వ్యవసాయానికి మంచి భవిష్యత్తు ఉందని చెప్పారు. ఈ ఏడాది 3.82 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అవుతుందని అంచనా ఉందని అందులో 66 శాతం సేకరించుటకు లక్ష్యంగా నిర్ణయించామని చెప్పారు. ధాన్యం కొనుగోలు శుక్ర వారం ప్రారంభించామని, రాబోయే రెండు, మూడు నెలల్లో కొనుగోలుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు. జిల్లాలో ఏనుగుల వలన పంట నష్టం జరుగుతుందని, ముఖ్య మంత్రి దృష్టిలో పెట్టడం జరిగిందని ఆయన వివరించారు. ముఖ్య మంత్రి సానుకూలంగా స్పందించారని ఆయన పేర్కొన్నారు. డాక్టర్ డి.రామమోహరావు మాట్లాడుతూ వ్యవసాయాన్ని వదల కూడదని డా.ఎం.ఎస్.స్వామినాథన్ చెప్పారని తెలిపారు. వ్యవసాయ రంగం లేకపోతే నిరుద్యోగం పెరుగుతుందని చెప్పారు. వరి తగ్గించి, మెట్టు పంటలు పండించాలని చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లా ఆయిల్ పామ్ ఉత్తమమైన ప్రాంతమని అన్నారు. తోటపల్లి ప్రాంతం అనుకూలమని ఆయన చెప్పారు. వివిధ మండలాల నుండి పాల్గొన్న వ్యవసాయ సలహా మండలి అధ్యక్షులు, సభ్యులు, రైతులు మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు మిల్లర్ల ప్రమేయం లేకుండా చేపట్టాలని, మిల్లర్లు సిండికేట్ గా మారి రైతులను మోసం చేస్తున్నారని వివరించారు. ఈ అన్యాయాన్ని అడ్డుకోవాలని సూచించారు. ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, రైతులకు చిన్న యంత్ర పరికరాలు అందించాలని, గిరిజనులకు అల్లం, పసుపు విత్తనాలు అందించాలని కోరారు. కొమరాడ మండలంలో జంఝావతి ప్రాజెక్టు హై లెవెల్ కెనాల్ కు నీటి సరఫరా చేయక పంటలు నష్టపోవడం జరుగుతుందని వివరించారు. ఉద్యానవన పంటలకు ప్రోత్సాహం అందించాలని కోరారు. నాలుగు నియోజక వర్గాలలో చెరకు రైతులకు ఆదుకోవలసిన అవసరం ఉందని సూచించారు.
జిల్లా అధికారులు శాఖా పరంగా అమలు చేస్తున్న పథకాలను వివరించారు.
ఈ సమావేశంలో డిసిఎంఎస్ అధ్యక్షులు డా.అవనాపు భావన, వ్యవసాయ మిషన్ సభ్యులు రామారావు, గొండు రఘురాం, శాశ్వత కార్యనిర్వాహణ సభ్యులు డా. చంద్ర శేఖర రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి కె. రాబర్ట్ పాల్, జిల్లా పశుసంవర్ధక అధికారి ఏ. ఈశ్వర రావు, జిల్లా ఉద్యాన అధికారి కె.వి.ఎస్.ఎన్ రెడ్డి, ఏపిఎంఐపి పిడి ఎల్. శ్రీనివాస రావు, జిల్లా సహకార అధికారి సన్యాసి నాయుడు, జిల్లా మత్స్య అధికారి వేమూరి తిరుపతయ్య, శాస్త్రవేత్తలు డా.సీతారాం, డా. శ్రీనివాస రాజు, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ ఎం.డి.నాయక్, జిల్లా సరఫరా అధికారి కె.వి.ఎల్.ఎన్ మూర్తి, రైతులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img