జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర అనంతపురం వైద్యం : జిల్లా స్పెషల్ బ్రాంచి పోలీసులు & ఇటుకలపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించి అక్రమంగా నాటు తుపాకీ కల్గిన ఇద్దర్ని అరెస్టు చేశారు. వీరి నుండీ నాటు తుపాకీ, 60 కర్నాటక టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఒకరు అరెస్టు కావాల్సి ఉంది. గాలింపు చర్యలు చేపట్టారు. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ బుధవారం విలేకరుల సమావేశం నిర్వహించి ఇందుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.
1) నడిమిదొడ్డి పెన్నోబులేసు, వయస్సు 35 సంవత్సరాలు, ట్రాక్టర్ డ్రైవర్, ఉప్పరపల్లి గ్రామం, అనంతపురము రూరల్ మండలం.
2) ఇ. కన్నయ్య, వయస్సు 35 సంవత్సరాలు, కంప్లి కొట్టాల గ్రామం, బళ్ళారి జిల్లా, కర్నాటక (ప్రస్తుతం మైనారిటీ కాలనీ, రాప్తాడు మండలం.):
ప్రస్తుతం అరెస్టయిన వారిలో నడిమిదొడ్డి పెన్నోబులేసు, ఇ.కన్నయ్య, పరారీలో ఉన్న వ్యక్తి మంచి పరిచయస్తులే. వీరు తాగుడకు బానిసై అప్పులు చేశారు. పెన్నోబుళేసుకు సుమారు రూ. 30 లక్షలు అప్పులు ఉన్నాయి. ఇందులో వరుసకు మామయిన ఉప్పరపల్లికి చెందిన రాంభూపాల్ తో రూ. 1.50 అప్పుఉంది. అదేవిధంగా ఇ.కన్నయ్యకు కూడా అప్పులు ఉన్నాయి. ఆ అప్పులు తీర్చలేక గత నాలుగు నెలల నుంచి అక్రమ కర్నాటక మద్యం తెచ్చి ఉప్పరపల్లి మరియు చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువ రేటుకు అమ్ముతుండేవారు. అయినా కూడా వారికి అప్పులు తీరడం లేదు. ఈ నేపథ్యంలో మన దగ్గర తుపాకి ఉంటే డబ్బు ఉండే వారిని మరియు మనకు అప్పులు ఇచ్చిన వాళ్ళని బెదిరించి డబ్బులను సులభంగా సంపాదించవచ్చని భావించారు. పరారీలో ఉన్న వ్యక్తికి తెలిసినవాళ్ళ దగ్గర ఒక నాటు తుపాకి ఉందని … దానిని తీసుకొని వచ్చి ఇక్కడ బెదిరింపులకు పాల్పడుతూ బలవంతపు వసూళ్లకు ఒడికట్ట వచ్చని, ముఖ్యంగా ఉప్పరపల్లి రాంభూపాల్ ను తుపాకీతో బెదిరించాలని పథకం పన్నారు. అనుకున్నట్లుగానే తుపాకీ తీసుకొచ్చి ఉప్ఫరపల్లి- పసలూరు గ్రామాల మధ్యలోని శివ ఇటుకల బట్టి లో ఉండే గుడిసెలో దాచి ఉంచారు.
జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ ఆదేశాల మేరకు పక్కా రాబడిన సమాచారంతో అనంతపురం రూరల్ డీఎస్పీ శ్రీ బి.వి శివారెడ్డి, జిల్లా స్పెషల్ బ్రాంచ్ సి.ఐ జాకీర్ హుస్సేన్, ఇటుకలపల్లి ఎస్సై రాఘవేంద్రరెడ్డిల ఆధ్వర్యంలో ఇటుకలపల్లి & స్పెషల్ బ్రాంచి పోలీసులు ఉప్ఫరపల్లి- పసలూరు గ్రామాల మధ్యలోని శివ ఇటుకల బట్టి వద్ద ఉన్న గుడిసెలో సోదాలు నిర్వహించారు. ఈ ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి నుండి ఒక నాటుతుపాకి మరియు 60 కర్నాటక టెట్రా ప్యాకెట్స్ స్వాధీనం చేసుకున్నారు . ఇంకొక నిందితుడు అరెస్టు కావాల్సి ఉంది. గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
జిల్లాలో ఎక్కడైనా బెదిరింపులు, దౌర్జన్యాలకు పాల్పడినా… అక్రమంగా మారణాయుధాలు కల్గిఉన్నా, కర్నాటక లిక్కర్,నాటు సారా విక్రయిస్తున్నా తన ఫోన్ నంబర్ 9440796800 కు సమాచారం పంపాలన్నారు. వెంటనే చర్యలు తీసుకోవడంతో పాటు సమాచారం పంపిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఎస్పీ వెల్లడించారు.