నియోజకవర్గ కార్యదర్శి మధు
విశాలాంధ్ర – ధర్మవరం : చేనేత పరిశ్రమను కాపాడుకొనుటకు, చేనేత కార్మికుల జీవనోపాధిని మరింత మెరుగుపరిచేందుకు ధర్మవరం పట్టణంలో ఐదవ తేదీ మంగళవారం ఉదయం 10 గంటలకు జరుగు చేనేత సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి మధు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంగళవారం వారు విలేకరులతో మాట్లాడుతూ ఈ చేనేత సదస్సుకు ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి జెవి సత్యనారాయణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జగదీష్, రామచంద్ర, చేతివృత్తుల సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, శ్రీ సత్య సాయి జిల్లా సిపిఐ కార్యదర్శి వేమయ్య యాదవ్, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జింక చలపతి తదితరులు హాజరవుతున్నట్లు వారు తెలిపారు. మారిన చేనేత కార్మికుల పరిస్థితి ఏమాత్రం అభివృద్ధి కాలేదని తెలిపారు. వ్యవసాయం తర్వాత రెండవ స్థానంలో ఉన్న చేనేత పరిశ్రమను రక్షించుకోవలసిన బాధ్యత అందరిమీద ఉందని తెలిపారు. 11 రకాల చేనేత రిజర్వేషన్ చట్టాన్ని పగడ్బందీగా అమలు చేయాలని, చేనేత అడ్వైజర్ బోర్డును పునరుదించాలని, మహాత్మా గాంధీ రుణకర యోజన పథకం అమలు చేయాలని, చేనేతపై జీఎస్టీని పూర్తిగా రద్దు చేయాలని, ఆత్మహత్య చేసుకున్న చేనేత కుటుంబాలకు 10 లక్షల ఎక్స్గ్రేషియాలని వారు డిమాండ్ చేశారు. చేనేత కార్మికుల బ్యాంకు రుణాలు మాఫీ చేయాలని, హెల్త్ స్కీమ్ అమలు పరచాలని, కేంద్ర బడ్జెట్లో చేనేత రంగానికి 25 వేల కోట్లు కేటాయించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు రమణ, రవికుమార్, వెంకటనారాయణ, వెంకటస్వామి, సురేష్, శ్రీనివాసులు పాల్గొన్నారు.