Monday, May 29, 2023
Monday, May 29, 2023

గుచ్చిమిలో భూసార పరీక్షలు నిర్వహణ


విశాలాంధ్ర – సీతానగరం : మండలంలోని గుచ్చిమి గ్రామంలో మండల వ్యవసాయాధికారి ఎస్ అవినాష్ ఆద్వర్యంలో గురువారంనాడు భూసార పరీక్షలు నిర్వహణ, భూసార పరీక్షలకొరకు మట్టి నమూనాలు ఏవిధంగా సేకరించాలన్నదానిపై విఏఏలకు, రైతులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.రైతులు మంచి దిగుబడులు సాధించాలంటే భూసార పరీక్షలు అత్యంత ముఖ్యమైనవని, భూసార పరీక్షలకు అనుగుణంగా పంటలు సాగుచేస్తేనే రైతులకు మంచి పంట,దిగుబడులు సాధిస్తారని తెలిపారు. అధిక దిగుబడి పొందటంలో నేల స్వభావం, భూసారం కీలకంగా ఉంటుందని, అధికమోతాదులో రసాయన ఎరువుల వాడకం వల్ల భూసారం తగ్గిపోతుంది,దీంతో దిగుబడి కూడా తగ్గుతుందన్నారు.దీనివల్ల పెట్టుబడి అధికమవుతుందని,భూసార పరీక్షల ద్వారా పంటల దిగుబడి ఎంతవస్తుందనేది కూడా ముందుగానే ఒక అంచనాకు రావచ్చని తెలియచేశారు.మట్టి నమూనాలను పొలంగట్లు, చెట్లునీడలు,కాలి బాటలు,తడిగాఉన్న బురద, మట్టి వంటి ప్రదేశాలలో అలాగే కంపోస్ట్ పిట్స్, పెంట కుప్పలు వంటి ప్రదేశాలలో సేకరించకూడదని తెలియచేశారు.చౌడు భూములు వంటి ప్రదేశాలలో మట్టి నమూనా తీసినప్పుడు వాటిని వేరుగా సేకరించాలని తెలియచేశారు.పొలం అంతా ఓకేవిధంగా ఉన్న యెడల మట్టి నమూనాను ప్రతీ ఐదు ఎకరాలకు ఒక నమూనా తీసుకోవాలని, ఏదైనా ఒక ఎకర పొలంలో 10లేదా 12చోట్ల నమూనాను సేకరించాలన్నారు.మట్టి నమూనాను జిగ్ జాగ్ పద్ధతిలో వి ఆకారంలో వ్యవసాయ పంటలకు 15సెంటీమీటర్ల లోతు వరకు, ఉద్యాన పంటలకు ఒక అడుగులోతు వరకూ తీసిన మట్టి నమూనాను సేకరించాలని తెలియచేశారు.
ఒకేసంవత్సరంలో ఒకేపంట పండించు ప్రదేశాలలో 3లేదా4 సంవత్సరాలకు ఒకసారి, రెండు పంటలు పండించే ప్రదేశాలలో 2లేదా3 సంవత్సరాలకు ఒకసారి మట్టి నమూనా సేకరించాలని తెలియచేశారు.భూసారపరీక్షలో పొలం నుండి సేకరించిన మట్టి నమూనాలను వివిధ భౌతిక , రసాయన పరీక్షల ద్వారా పోషక పదార్ధాల పరిమాణాన్ని లెక్కగడతారన్నారు. భూమిలో ఉన్న పోషకాల అధారంగా ఏ పంటవేయాలి, ఎంత మోతాదులో ఎరువులు వేయాలో పరీక్షలద్వారా రైతులు ఒక అంచనాకు రావచ్చని,భూసార పరీక్షల వల్ల పొలంలోని పోషక పదార్ధాల స్ధాయిని తెలుసుకోవచ్చు,భూమి యొక్క భౌతిక , రసాయన స్ధితిని బట్టి ఏపంటలు పండించటానికి అనువుగా ఉంటుందో అర్ధమౌతుంది,మట్టిపరీక్ష ఫలితాలను బట్టి ఏపంటకు ఏయే మోతాదులో ఎరువులు వేయాలో వాటిని ఎప్పుడు వాడాలో తెలుస్తుంది, పంటపొలాల్లో చౌడు, ఆమ్ల స్ధాయిని నిర్ధారించి సరిచేసేందుకు సరైన పద్దతులు సిఫారుసు చేయవచ్చు,రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించుకునే వీలుంటుంది,భూములలో ఉన్న ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రియ కర్బనము, నత్రజని, భాస్వరం, పొటాష్ వంటి వాటితో పాటు అధిక దిగుబడికి వేయవలసిన ఎరువుల మోతాదు తెలుసుకోవచ్చని,భూసార పరీక్షల ఆధారంగా పంట భూములు నిస్సారమై చెడిపోకుండా పశువుల పెంట, కంపోస్టు, పచ్చిరొట్ట వంటి సేంద్రీయ ఎరువులు, రసాయనిక ఎరువులతో పాటు సమగ్రంగా, సమతుల్యంగా ఏమోతాదులో వాడుకోవాలో అవగాహనకు రావచ్చని తెలియచేశారు. ఈకార్యక్రమంలో సర్పంచ్ మర్రాపు ధనం, ఎంపీటీసీ జగదీశ్వరరావు, గ్రామ వ్యవసాయ సహాయకులు, రైతులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img