Friday, April 19, 2024
Friday, April 19, 2024

ప్రతి చేనేత కార్మికుడు చేనేత పరిశ్రమను పరిరక్షించుకోవాలి

నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు.. వెంకటనారాయణ, వెంకటస్వామి

విశాలాంధ్ర – ధర్మవరం : నేడు నియోజకవర్గంలో పవర్లూమ్స్ మగ్గాలు పుట్టగొడుగుల వెలిశాయని, ఇలాంటప్పుడు చేనేత పరిశ్రమలు నమ్ముకున్న చేనేత కార్మికులు రోడ్డున పడాల్సి వచ్చిందని, జీవనోపాధిని కోల్పోయి, కుటుంబం ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొంటుందని, అందుకే ప్రతి చేనేత కార్మికుడు చేనేత పరిశ్రమను పరిరక్షించుకోవాలని నియోజకవర్గ అధ్యక్ష, కార్యదర్శులు.. వెంకటనారాయణ, వెంకటస్వామి లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా గురువారం నియోజకవర్గంలోని ధర్మవరంలోని రాజేంద్రనగర్ వార్డులో చేనేత చైతన్య యాత్రను వారు ప్రారంభించారు. ఇంటింటా తిరుగుతూ చేనేత కార్మికుల యొక్క కష్టనష్టాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వాలు మారినా చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు మెరుగు పడటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పవర్ లూమ్స్ యాజమాన్యం వారికి సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం అండగా ఉన్నారని, అందుకే నేడు చేనేత కార్మికులు తమ వృత్తిని వదులుకోలేక, ఇక్కట్లకు గురై, రోడ్డు పాలు అయ్యారని తెలిపారు. కుటుంబాన్ని పోషించుకోవడానికి అప్పులు చేసి, ముడి సరుకుల ధరలు ఆకాశాన్ని అందడంతో, ఏమి చేయాలో చేనేత కార్మికునికి దిక్కుతోచక ఆకలి చావులతో, ఆత్మహత్యలు జరగడం నిజంగా బాధాకర మన్నారు. చేద్దామంటే పని లేదు- చేసిన పనికి కూలి లేదు- నేద్దామంటే మగ్గమే లేదు- నేసిన చీరకు గిట్టుబాటు ధర లేకపోవడం వలనే, నేడు చేనేత కార్మికులు తమ జీవనాన్ని కష్టాల్లోనే ఉంటూ, జీవించడం జరుగుతుందన్నారు. నేడు చేనేత కార్మికులు మాకు దారేంటి? మా భవిష్యత్తు ఏంటి? అని తీవ్ర ఆవేదన చెందుతున్న కూడా… ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వము గాని స్పందించకపోవడం సిగ్గుచేటు అన్నారు. నేడు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పవర్ లూమ్స్ లను ఏర్పాటు చేసిన సంపన్నులు, తక్కువ వేతనాలకు కలకత్తా నుండి నేతగాలను తెచ్చి, నేయించుకోవడం ఎంతవరకు సమంజసమని వారు తెలిపారు. ఒకప్పుడు చేనేత కార్మికుని మగ్గంలోకి దించుకోవడానికి పోటీలు పడ్డ మాస్టర్ వీవర్స్, ఇప్పుడు ముఖం చాటేస్తున్నారని తెలిపారు. నేడు ఈ చేనేత పరిశ్రమను నమ్ముకున్న ఏ నేత కార్మికులు వేయడానికి మగ్గము లేకపోవడంతో, విధిలేక ఆర కొరవేతనాలకే పని చేయడానికి సిద్ధమవుతున్న ఈ నేపథ్యంలో… వీటన్నింటికీ కారణమైన వారిని నిలదీయ వలసిన సమయం ఆసన్నమైనదని చేనేత కార్మికులు ఈ సంక్షోభం నుండి బయట పడటానికి ఆఖరి పోరాటానికి సిద్ధం కావాలని వారు ఇంటింటా ప్రచారం చేస్తున్నారు. చేనేత కార్మికులు అందరూ కూడా ఐక్యంతోనే పోరాటాలు చేస్తే మనకు విజయం తప్పదని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో చేనేత కార్మిక సంఘం నాయకులు శ్రీనివాసులు, బాల రంగయ్య, గంగాధర, నాగరాజు, వెంకటనారాయణ, అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొన్నారు.-

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img