డీఈవో మీనాక్షి దేవి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున
విశాలాంధ్ర – ధర్మవరం : ప్రతి విద్యార్థి లక్ష్యంతో ముందుకు వెళ్లినప్పుడే అనుకున్న విజయం తప్పక వస్తుందని డీఈవో మీనాక్షి దేవి మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున పేర్కొన్నారు. ఈ సందర్భంగా పట్టణంలోని కొత్తపేటలో గల మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ లో పదవ తరగతి విద్యార్థులు నిర్వహించిన సరస్వతీ పూజకు శనివారం వారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. తొలుత ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన తో పాటు సరస్వతి మాతకు పూజలను నిర్వహించారు. అనంతరం డిఇఓ, మున్సిపల్ కమిషనర్లు మాట్లాడుతూ ఇప్పటికే ఈ పాఠశాల రాష్ట్రవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిందని, ఆ గుర్తింపును మరింత రెట్టింపు చేసే లాగా పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు చక్కగా రాసి ఉత్తమ ఫలితాలతో ముందుండాలని వారు తెలిపారు. తల్లిదండ్రులు కూడా పరీక్షా సమయంలో తమ తమ పిల్లలను ప్రోత్సహిస్తూ, మంచి ఉత్తీర్త సాధించేలాగా కృషి చేయాలని తెలిపారు. తదుపరి కరాటే మాస్టర్ ఇనాయత్ బాషా పాఠశాలలో ఉచిత కరాటేను విద్యార్థినిలకు నేర్పడం గర్వించదగ్గ విషయమని తెలుపుతూ కరాటే మాస్టర్ను ముఖ్య అతిథులు అభినందించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు కరాటే విద్య ప్రదర్శన కూడా అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం మేరీ వర కుమారి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ లావణ్య, వైస్ చైర్మన్ ఉమాలతో పాటు ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, పాఠశాల విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.-