ఆప్తాలమిక్ ఆఫీసర్. డాక్టర్.. ఉరుకుందప్ప.
విశాలాంధ్ర ధర్మవరం:: నేత్ర దానం పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన చేసుకోవాలని ఆప్తాలమిక్ ఆఫీసర్ ఉరుకుందప్ప పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం 38వ జాతీయ నేత్రదాన పక్షోత్సవములో భాగంగా సాయి నగర్లో గల యూపీహెచ్ఎస్సి నందు నేత్రదానం పట్ల ప్రజలకు అవగాహన కార్యక్రమాన్ని వారు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేత్రదానమును వయోలింగ భేదం లేకుండా ఎవరైనా చేయవచ్చునని, కార్నియా సమస్య వల్ల చూపు కోల్పోయిన ఇద్దరికీ నేత్రదానం చేసిన వ్యక్తి కళ్ళు ఆపరేషన్ ద్వారా మార్చడం జరుగుతుందన్నారు. వ్యక్తి మరణించిన ఆరు గంటల లోపు నేత్రదానమును చేయాలని తెలిపారు. 24 గంటలలోపల చూపులేని వారికి మార్చడం జరుగుతుందన్నారు. అదేవిధంగా నీటిలో మునిగి చనిపోయిన వారు, శరీరం కాలి చనిపోయిన వారు, క్యాన్సర్ లాంటి ఆరోగ్య సమస్య ఉన్న వారి కళ్ళు నేత్రదానానికి పనికిరావు అని తెలిపారు. నేత్రదానం చేయడం వలన పార్తవ దేహానికి ఎలాంటి వికారం కలగదని, ఇలాంటి అపోహలు ప్రజల్లో తొలగిస్తూ, ప్రజలకు నేత్రదానం పట్ల అవగాహన కల్పించడమే మా ధ్యేయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.