Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

విద్యుత్ కోతలు ఆపకపోతే రైతుల ఆగ్రహం తప్పదు

విద్యుత్ కోతలు ఆపకపోతే రైతుల ఆగ్రహం తప్పదు
ఏపీ రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున
అనంతపురం అర్బన్: జిల్లాలో కొనసాగుతున్న విద్యుత్ కోతలపై రైతు సంఘం నాయకులు ఆందోళన బాట పట్టారు. ఈ మేరకు గురువారం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో జిల్లా విద్యుత్ శాఖ ఎస్సి కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యమానికి ఎపి రైతు సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జున ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరగడంతో లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి పండిస్తున్న పంటలు నీరు లేక పూర్తిగా ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియక రైతులు అయోమయ స్థితిలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.
ఈ విషయం పై గత 15 రోజులుగా రైతులు స్వచ్ఛందంగా సబ్ స్టేషన్ ల వద్ద ఆందోళనలు, నిరసనలు చేపట్టినా అటు ప్రభుత్వంలోనూ ఇటు ఉన్నతాధికారుల్లోనూ చలనం లేకుండా పోయిందని విరుచుకు పడ్డారు. చేతికి రావాల్సిన పంటలు ఎండిపోతున్న నేపద్యంలో రైతులు ఆందోళన చెందుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

లక్షల పెట్టుబడి పెట్టి రైతులు అప్పులపాలైపోతున్నారని విచారం వ్యక్తంచేశారు. ఇటీవల అధిక వర్షాలు,అకాల వర్షాలతో ఇప్పటికే జిల్లాలో పంటలు నాశనమై అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని వాపోయారు.మరోవైపు పండిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక ఆర్థిక భారంతో నరక యాతన అనుభవిస్తున్నారన్నారు.ప్రకృతి ఒకవైపు పాలకుల నిర్లక్ష్యం మరోవైపు రైతాంగాన్ని కుదేలయ్యేలా చేస్తున్నారని ధ్వజమెత్తారు.రాష్ట్రంలో మిగులు విద్యుత్ ఉండాల్సిన పరిస్థితుల్లో లోటు విద్యుత్ ఉందని అధికారులే చెబుతున్నారని అన్నారు.
ఇలాంటి పరిస్థితి వస్తుందని రైతులకు అధికారులు ముందస్తు సమాచారం ఇవ్వకుండా రైతులు లక్షల ఎకరాల్లో పంటలు వేసిన అనంతరం ఇలాంటి చేతకాని మాటలు అధికారులు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారులు వెంటనే స్పందించి నాణ్యమైన ఉచిత 9 గంటల కరెంటును సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.అనంతరం విద్యుత్ శాఖ ఎస్సి కి వినతిపత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెన్నప్ప యాదవ్, ఉపాధ్యక్షుడు బండి రామకృష్ణ,నాయకులు మనోహర్,రాము, వెంకట్రాముడు,మధు, వెంకటనారాయణ,రమేష్, రవీంద్ర,నగేష్,నరేంద్ర, దుర్గాప్రసాద్,వెంకట్,ఓబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img