Wednesday, October 4, 2023
Wednesday, October 4, 2023

గిడుగు వెంకట రామమూర్తి సేవలు వెలకట్టలేనివి

జిల్లా కలెక్టర్ యం.గౌతమి
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : గిడుగు వెంకట రామమూర్తి పంతులు తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడుగా చేసిన సేవలు వెలకట్టలేనివని జిల్లా కలెక్టర్ యం.గౌతమి పేర్కొన్నారు. మంగళవారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతి వేడుకలలో భాగంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రం ఏర్పాటులో గిడుగు వెంకట రామమూర్తి చేసిన కృషి మనందరం గుర్తుంచుకోవాలన్నారు. గిడుగు వెంకట రామమూర్తి ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లాలోని పర్వతాల పేట గ్రామంలో 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించారన్నారు. గ్రాంథిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని, వీలును తెలియజెప్పిన మహనీయుడు, తెలుగులో వాడుక భాషా ఉద్యమ పితామహుడు గిడుగు వెంకట రామమూర్తి అన్నారు. గిడుగు ఉద్యమం వల్ల ఏ కొందరికో పరిమితమైన చదువు వ్యవహారిక భాషలో సాగి అందరికీ అందుబాటులో వచ్చిందన్నారు. ఆంధ్రదేశంలో వ్యవహారిక భాషా ఉద్యమానికి మూల పురుషుడిగా, బహుభాషా శాస్త్రవేత్తగా, చరిత్రకారుడిగా, సంఘసంస్కర్తగా గిడుగు రామమూర్తి నిలిచారని, ఆయన జయంతి ఆగస్టు 29వ తేదీన తెలుగు భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నామన్నారు. 1906 నుండి 1940 వరకు గిడుగు రామమూర్తి చేసిన కృషి అంతా తెలుగు భాషా సేవ కోసమే చేశారని, తెలుగు భాష కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని, ఆయన సేవలను ప్రతి ఒక్కరు స్మరించాలని పేర్కొన్నారు. తెలుగు భాష దేశ, విదేశాల్లో ఎంతో గుర్తింపు పొందిన ప్రాచీన భాష అని, తెలుగు భాషకు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలుగు భాషను ప్రతి ఒక్కరూ గౌరవించాలన్నారు. దేశ, విదేశాల్లో తెలుగు భాష ఖ్యాతిని మరింత పెంపొందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రోజువారి కమ్యూనికేషన్ కూడా తెలుగులోనే చేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు ఉన్నాయని, వీలైనంతవరకు కలెక్టరేట్లో తెలుగులోనే కమ్యూనికేషన్ జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ కుషాల్ జైన్, జిల్లా టూరిజం అధికారి నాగేశ్వర్ రెడ్డి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, ఐసిడిఎస్ పిడి శ్రీదేవి, ఫిషరీస్ డిడి శాంతి, కలెక్టరేట్ సూపరింటెండెంట్ లు, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img