విశాలాంధ్ర-రాప్తాడు : నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకంలో భాగంగా జగనన్న కాలనీలలో నిర్మించిన ఇళ్ల వద్ద త్వరితగతిన ఇంకుడు గుంతలు తవ్వించాలని జిల్లా వ్యవసాయ అధికారి, మండల నోడల్ అధికారి ఉమామహేశ్వరమ్మ ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ సాల్మన్, ఏపీఓ సావిత్రి, ఏఓ వెంకటేశ్వరప్రసాద్, ఈసీ మురళీ, టెక్నికల్ అసిస్టెంట్లు, పంచాయతీ కార్యదర్శులు, ఇంజినీరింగ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. మండల వ్యాప్తంగా ఉన్న లేఔట్ లలో నిర్మాణం పూర్తయిన 244 ఇళ్ల వద్ద తాత్కాలిక డ్రెయినేజీ అవసరాల కోసం ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
ఒక్కో ఇంకుడు గుంత నిర్మించడానికి దాదాపు రూ.6 వేల వరకు ప్రభుత్వం ఖర్చు చేయనుందని…ఉపాధి హామీ పథకం నిధులతో ఇంకుడు గుంతలను నిర్మిస్తామన్నారు. ఈ మొత్తం సంబంధిత ఇంటి లబ్ధిదారుడి ఖాతాలో జమ అవుతుందన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఎంపీడీఓల నేతృత్వంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌లకు ఇంకుడు గుంతల నిర్మాణం పర్యవేక్షణ బాధ్యతలను నిర్వర్తించాల్సి ఉంటుందన్నారు.