జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్
విశాలాంధ్ర- అనంతపురం వైద్యం : మాజీ ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్ఫూర్తితోనే రక్షణ బలగాలు దేశ అంతర్గత భద్రతను కాపాడుతున్నాయని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్ పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకుని మంగళవారం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలో జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ముందుగా… సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి ఆయన పూల మాల వేసినివాళులు అర్పించారు. బెలూన్లు, తెల్ల పావురాలను ఎగురవేశారు. అనంతరం దేశ సమైక్యత, సమగ్రతలకు అంకితభావంతో పాటు పడదామని సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ… భారత దేశ ఉక్కు మనిషిగా పేరొందిన సర్ధార్ వల్లభాయ్ పటేల్ స్వాతంత్ర్య సమరయోధుడిగా అనేక సేవలు అందించాడని గుర్తు చేశారు. స్వాతంత్ర్యానంతరం 543 రాజరిక సంస్థానాలను విలీనం చేయడానికి గట్టి కృషి చేశారన్నారు. అన్ని కలిసి వచ్చినప్ఫటికీ మూడు సంస్థానాలు ముందుకు రాలేదన్నారు. హైదరాబాద్, జొనాఘడ్, జమ్ము కాశ్మీర్ సంస్థానాలను అతి తక్కువ కాలంలో పోలీసు, మిలిటరీ బలగాల ద్వారా విలీనం చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. మహాత్ముల ఆశయాల వల్ల నేడు మనం కన్యాకుమారి టు కాశ్మీర్ వరకు స్వేచ్ఛగా, ఐక్యంగా జీవిస్తున్నామన్నారు. త్యాగధనులను స్ఫూర్తిగా చేసుకుని విధులు నిర్వహిద్దామన్నారు. జాతీయోద్యమానికి ఆకర్షితుడైన ఆయన మహాత్మా గాంధీజీ నాయకత్వంలో కొనసాగిన ఉద్యమాల్లో పాలు పంచుకున్నాడన్నారు. బ్రిటీష్ ప్రభుత్వం విధించిన పన్నులకు వ్యతిరేకంగా జరిపిన కిసాన్ ఉద్యమం, సహాయ నిరాకరణ, క్విట్ ఇండియా ఉద్యమాల్లో కీలక పాత్ర పోషించాడన్నారు. దేశ ప్రజల సంక్షేమం కోసం చాలా సాంఘిక ఉద్యమాలు నిర్వహించాడన్నారు. గుజరాత్ రాష్ట్రంలో మద్యపానం, అస్పృస్యత, కుల వివక్షలకు వ్యతిరేకంగా పని చేశారన్నారు. రాజ్యాంగ సభ్యుడిగా, మంచి నాయకుడిగా భారత ప్రజలకు ఎనలేని సేవలందించి చరిత్ర పుటల్లో అగ్రస్థానంలో నిలవడం ముదావహమన్నారు. సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి 1991 సంవత్సరంలో భారతరత్న అవార్డును ప్రదానం చేయడం అభినందనీయమన్నారు. జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని పోలీసు అమర వీరుల స్థూపం వద్ద 2 కె రన్ ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. అంబేద్కర్ కూడలి, సప్తగిరి సర్కిల్ , సుభాష్ రోడ్డు, క్లాక్ టవర్, కోర్టు రోడ్డు, పోలీసు పరేడ్ మైదానం వరకు కొనసాగింది. ఈకార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఆర్ విజయభాస్కర్ రెడ్డి, ఎ.హనుమంతు, ఏ.ఆర్ డీఎస్పీ మునిరాజు, సి.ఐ లు ప్రతాప్ రెడ్డి, రెడ్డెప్ప, శివరాముడు, రామకృష్ణారెడ్డి, విశ్వనాథచౌదరి, వెంకటేష్ నాయక్, దేవానంద్, మోహన్, ఆర్ ఐ లు హరికృష్ణ, రాముడు, పలువురు ఆర్ ఎస్ ఐ లు, జిల్లా పోలీసు అధికారుల సంఘం అడహక్ కమిటీ సభ్యులు సాకే త్రిలోకనాథ్, సుధాకర్ రెడ్డి, గాండ్ల హరినాథ్, తేజ్ పాల్ , పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ పాఠశాలల విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.