విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి వ్యక్తి భగవంతుని ఏకాగ్రతతో పూజించితే చక్కటి మనశాంతి ఆరోగ్యకరమైన జీవితము లభిస్తుందని కేరళ- ఆనందాశ్రమం- మాతాజీ స్వామిని చంద్రానంద తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కళాజ్యోతి సర్కిల్లో గల సాంస్కృతిక మండలి లో వివేకానంద యోగా కేంద్ర, ధర్మవరం యోగా అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న భగవద్గీత సాధన శిబిరాన్ని వారు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కేరళ రాష్ట్రంలోని ఆనందాశ్రమములో గల ఁమాతాజీ స్వామిని చంద్రా నందఁ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈ సందర్భంగా వారు భగవద్గీతలోని ఎంపిక చేసిన శ్లోకముల ద్వారా గీత సాధనను వారు బోధించారు. అనంతరం భగవద్గీతలోని పలు అధ్యాయములలోని వాటిని గూర్చి మాట్లాడుతూ నిత్యజీవితంలో అన్ని సవాలు మధ్య, అన్ని సంఘటనలు, ఇతర వ్యక్తులతో అన్ని పరిస్థితులలో దేనిమీద వ్యామోహరహిత స్థితిలో అంతర్గత శాంతి, ఆనందాన్ని ఎలా పొందాలి? అనే విషయాన్ని వారు తెలియజేశారు. అదేవిధంగా కర్మ, భక్తి, జ్ఞాన యోగములు యొక్క సాధన గురించి కూడా తెలియజేశారు. హిందువుల పరమ పవిత్ర గ్రంధాలలో భగవద్గీత ఒకటి అని, భగవద్గీతను ఒక ప్రత్యేక గ్రంథం గా అందరూ భావించాలని, గురు శిష్యుల బంధము, గురువు శిష్యులతో బోధించు అంశము, భగవద్గీతలోని ఎంపిక చేసిన శ్లోకములకు భావాలు వారు తెలియజేశారు. భగవద్గీత పారాయణమును అనుకూలమైన సమయంలో అందరూ పాటించాలని, భగవద్గీతలో వేద, వేదాంత, యోగా విశేషాలు ఉంటాయని తెలిపారు. భగవద్గీతను తరచుగా గీత లేదా గీతోప నిషత్తు అని కూడా పిలుస్తారని తెలిపారు. అంతేకాకుండా భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్య సాధన విధానాలు కూడా బోధించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాజుల సోమేశ్వర్ రెడ్డి, తిరుమలేశు, రామన్న, కట్టా రవి, కరెంటు ఆదినారాయణ, నరసింహులు, ఈశ్వరయ్యలతో పాటు వందలాదిమంది పురుషులు, మహిళలు పాల్గొన్నారు.