విశాలాంధ్ర – నందికొట్కూరు : ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఈ నెల 30 వ తేదీన నంద్యాల జిల్లాలోని 7 నియోజకవర్గ కేంద్రాలలో నియోజకవర్గ స్థాయి వ్యాయామ విద్య స్కూలు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందని నంద్యాల జిల్లా క్రీడా సమాఖ్య కార్యదర్శి శ్రీనాథ్ పేరుమల్ల సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన తెలియజేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి స్కూల్ కాంప్లెక్స్ సమావేశాలకు జిల్లాలోని అందరు వ్యాయామ ఉపాధ్యాయులు తమకు నిర్దేశించిన కేంద్రాలలో తప్పనిసరిగా హాజరు కావాలన్నారు.జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఈ స్కూలు కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నామని వ్యాయామ ఉపాధ్యాయులందరూ సమయపాలన పాటించాలని తెలియజేశారు. నంద్యాల నియోజకవర్గ సమావేశం ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల నంద్యాల నందు, ఆళ్లగడ్డ నియోజకవర్గ సమావేశం వై.పీ.పీ.యం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆళ్లగడ్డ నందు, శ్రీశైలం నియోజకవర్గ సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆత్మకూరు నందు, నందికొట్కూరు నియోజకవర్గ సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందికొట్కూరు నందు, బనగానపల్లె నియోజకవర్గ సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల బనగానపల్లె నందు, పాణ్యం నియోజకవర్గ సమావేశం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పాణ్యం నందు, డోన్ నియోజకవర్గ సమావేశం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (కొత్తపేట) డోన్ నందు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.