Saturday, December 2, 2023
Saturday, December 2, 2023

పేరు మోసిన అంతర్ రాష్ట్ర దొంగలు అరెస్టు

పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ సహా వేర్వేరుగా జిల్లాలో ముగ్గురి అరెస్టు
ఈ ముగ్గురి నుండి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 23.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం
వీరిలో అంతర్రాష్ట్ర దొంగపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు… మరో దొంగపై 10 కేసులు… మరో దొంగపై 03 కేసులు
ఇందులో శ్రమించిన అనంతపురము రూరల్, పుట్లూరు మరియు గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులను అభినందించిన జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్,

విశాలాంధ్ర -అనంతపురం వైద్యం : జిల్లాలో ముగ్గురు దొంగలను అనంతపురం రూరల్, పుట్లూరు, గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు వేర్వేరుగా అరెస్టు చేశారు. వీరి నుండి సుమారు రూ. 12 లక్షల రూపాయల విలువచేసే 23.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముగ్గురు దొంగలూ పాత నేరస్తులే. వీరిలో అంతర్రాష్ట్ర దొంగపై ఆంధ్ర, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాలలో 50 కి పైగా కేసులు… మరో దొంగపై 10 కేసులు… ఇంకో దొంగపై 03 కేసులు ఉన్నాయి. ముగ్గురూ తాళం వేసిన ఇళ్ల ను టార్గెట్ చేసుకొని నేరాలకు పాల్పడేవారు. మంగళవారం జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు.
అనంతపురం రూరల్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడి వివరాలు నేపథ్యం:

1) పీట్ల గంగాధర్ @ సాంబ, వయస్సు 27 సం లు, కళ్యాణదుర్గం పట్టణం, అనంతపురము జిల్లా.
స్వాధీనం చేసుకున్నవి :
సుమారు 06 తులాల బంగారు ఆభరణాలు
ఇతను పాత నేరస్తుడు. అంతర్రాష్ట్ర దొంగ. తెలంగాణ, కర్నాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మొత్తం 50 పైగా దొంగతనాల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నెల నుండీ అనంతపురం నగరంలోని వివేకానందనగర్, సిండికేట్ నగర్ లలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేసి పగటి పూట దొంగతనాలకు పాల్పడ్డాడు. ముందురోజు రెక్కీ చేయడం… మరుసటి రోజు ఇళ్లల్లో చోరీలు చేయడం ఇతనికి రివాజు. అనంతపురం కేసులలో సుమారు 06 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్రం నారాయణపేట జిల్లా పోలీసులు ఇతనిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపగా ఇటీవలే జైలు నుండీ బయటికొచ్చాడు.
అరెస్టు ఇలా: డీఎస్పీ బి.వి శివారెడ్డి పర్యవేక్షణలో అనంతపురం రూరల్ ఎస్సై ప్రవీణ్ కుమార్, హెడ్ కానిస్టేబుల్ కె .కిష్టప్ప, కానిస్టేబుళ్లు రాజు, పాండవలు బృందంగా ఏర్పడి సోమవారం అరెస్టు చేశారు.
పుట్లూరు పోలీసులు అరెస్టు చేసిన నిందితుడి వివరాలు నేపథ్యం:
2) బస్సే సుబాష్, వయస్సు 19 సం.లు, నార్పల మండల కేంద్రం
స్వాధీనం చేసుకున్నవి:
సుమారు 11 తులాల బంగారు ఆభరణాలు
ఇతను దుర్వ్యసనాలు, జల్సాలకులోనై వీటి కోసం సులువుగా డబ్బు సంపాందించాలని భావించి దొంగతనాలకు అలవాటు పడ్డాడు. తాడిపత్రి రూరల్, పట్టణ పోలీసు స్టేషన్లలో 05 కేసులు ఉన్నాయి. వీటితో పాటు తాజాగా మరో 05 చోరీలకు పాల్పడ్డాడు. ఈ ఏడాది ఆగస్టు నెలలో బుక్కరాయ సముద్రం మండలం B.కొత్తపల్లిలో దొంగతనాలు చేశాడు. ఆ తర్వాత తాడిపత్రి రూరల్ మండలం చిన్నపొడమలలోని ఓ ఇంట్లో దొంగతనం చేసినాడు. దీంతో పాటు ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యల్లనూరు మండల కేంద్రంలో మరియు పుట్లూరు మండలం గోపరాజుపల్లి గ్రామంలో తాళం వేసిన ఇళ్లల్లో చోరీలకు పాల్పడ్డాడు.
అనంతపురం రూరల్ డీఎస్పీ బి.వి.శివారెడ్డి పర్యవేక్షణలో పుట్లూరు ఎస్ ఐ దిలీప్ కుమార్, హెడ్ కానిస్టేబుళ్లు సి .ప్రసాద్, కె .చంద్ర శేఖర్ కానిస్టేబుళ్లు అనిల్, దేవులా నాయక్, గౌస్, కిశోర్ కుమార్, శివ శంకర్, నరేశ్ లు బృందంగా ఏర్పడి నిన్న అరెస్టు చేశారు
గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు చేసిన నిందితుడి వివరాలు నేపథ్యం:
3) కంసలి పవన్ బహదూర్ @ బీర్ బహదూర్, రాజేంద్ర నగర్ , గుంతకల్లు పట్టణం
స్వాధీనం చేసుకున్నవి :
6.5 తులాల బంగారు ఆభరణాలు
గుంతకల్లు రైల్వే క్వార్టర్స్ లోని ఓ ఇంట్లో ఈ ఏడాది జూలై చివరి వారంలో దొంగతనం జరిగింది. ఆసందర్భంగా బంగారు బ్రాస్ లైట్, ఒక బంగారు నెక్లెస్, చిన్న బంగారు ఉంగరాలు, ఆరు జతల బంగారు కమ్మలు, రెండు బంగారు ఉంగరాలు, మొత్తం కలిపి సుమారు 6.5 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. జిల్లా ఎస్పీ శ్రీ కేకేఎన్ అన్బురాజన్ ఈ కేసును ఛేదించాలని ఆదేశించారు. ఈ క్రమంలో గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్ప పర్యవేక్షణలో గుంతకల్లు ఒన్ టౌన్ సి.ఐ రామసుబ్బయ్య ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక బృందంగా ఏర్పడి నిఘా ఉంచారు. పక్కా రాబడిన సమాచారంతో సోమవారం హనుమాన్ సర్కిల్ లో ఈకేసులో ప్రదాన నిందితుడైన కంసలి పవన్ బహదూర్ @ బీర్ బహదూర్ ను అరెస్టు చేశారు. గుంతకల్లు పట్టణం రాజేంద్రనగర్ కు చెందిన ఇతను, మరొక నిందితుడైన బండారు విజయకుమార్ కలిసి సదరు ఇంట్లో దొంగతనానికి ఒడిగట్టినట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో చోరీకి గురైన మొత్తం 6.5 తులాల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ సుమారు రు. 3.25 లక్షలు ఉంటుంది. రెండవ నిందితుడైన బండారు విజయకుమార్ ను ఇదివరకే గుంతకల్లు ఒన్ టౌన్ పోలీసులు అరెస్టు కూడా చేశారు. ప్రస్తుతం అరెస్టయిన కంసలి పవన్ బహదూర్ బీర్ బహదూర్ పాత నేరస్తుడు. ఇదివరకే గుంతకల్లు ఒన్ టౌన్, టూటౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో రెండు దొంగతనాలు చేశాడు.
ప్రశంస: పేరు మోసిన అంతర్రాష్ట్ర దొంగ సహా ముగ్గుర్ని అనంతపురము రూరల్ డీఎస్పీ B.వెంకట శివా రెడ్డి మరియు గుంతకల్లు డీఎస్పీ యు.నరసింగప్పల ఆద్వర్యం లో వేర్వేరుగా అరెస్టు చేసిన గుంతకల్లు ఒన్ టౌన్ సి.ఐ రామసుబ్బయ్య, అనంతపురం రూరల్ ఎస్సై ప్రవీణ్ కుమార్, పుట్లూరు ఎస్ ఐ దిలీప్ కుమార్, సిసిఎస్ ఎస్సై నాగరాజు, హెడ్ కానిస్టేబుల్స్ కె .కిష్టప్ప, సి .ప్రసాద్, కె .చంద్ర శేఖర్, కానిస్టేబుళ్లు అనిల్, దేవులా నాయక్, గౌస్, రాజు, పాండవ, కిశోర్ కుమార్, శివ శంకర్, నరేశ్ మరియు సిసిఎస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ కేకేఎన్ అన్బురాజన్, అభినందించి నగదు రివార్డులు అందజేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img