స్పందన హాస్పిటల్ డాక్టర్ పావని
విశాలాంధ్ర -ధర్మవరం : ప్రజలందరూ రక్తపోటుపై అవగాహన పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని స్పందన హాస్పిటల్ డాక్టర్ పావని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బుధవారం ప్రపంచ రక్తపోటు దినోత్సవ సందర్భంగా పలు విషయాలను వారు తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రక్తపోటును కచ్చితంగా తనిఖీ చేసుకుంటే జీవిత కాలాన్ని మెరుగుపరుచుకునే అవకాశం ఉందని తెలిపారు. ధూమపానం, మద్యం ఎక్కువగా తీసుకోవడం, అధిక బరువు ఉండడం, శారీరక శ్రమ లేకపోవడం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం, మానసిక ఒత్తిడి అనునవి రక్తపోటు లక్షణాలని తెలిపారు. ఈ రక్తపోటు హృదయ సంబంధ వ్యాధులకు ప్రధాన ప్రమాద కారకమని, అధిక రక్తపోటు మెదడుపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. అంతేకాదు కిడ్నీలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. దీనివల్ల కిడ్నీలు కూడా దెబ్బతినే అవకాశం ఉందని తెలిపారు. రెచ్చపోటు వ్యాధి గురించి అవగాహన పెంచుకుంటేనే ఆరోగ్యంగా ఉండగలమని, ప్రతిరోజు తీసుకునే ఆహారంలో ఉప్పు తక్కువగా ఉండేలా చూసుకోవాలన్నారు. ఆహారంలో కొవ్వు పదార్థాలు పరిమితి మించకుండా జాగ్రత్తలను పాటించాలని తెలిపారు. అధిక బరువు ఉన్నట్లయితే తగిన వ్యాయామం చేయాలని తెలిపారు. అధిక రక్తపోటు ఉన్నట్లయితే వైద్యుల సలహాలపై తగిన మందులను నిరంతరాయం తీసుకోవాలని తెలిపారు. మారిన జీవనశైలే కారణమని ఇటీవల అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం మనిషిని కాలు కూడా కదపనీయడం లేదని, సెల్ఫోన్ సంభాషణలు ఇంటర్నెట్ చాటింగులు మనిషి జీవన శైలిని పూర్తిగా మార్చేశాయని తెలిపారు. ఇంటి ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వకుండా హోటల్లో రెడీమేడ్ గా దొరికే ఆహార పదార్థాలు, మధ్యము కూడా అధిక బరువుకు కారణమవుతున్నాయని తెలిపారు. ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యంగా ఉండరాదని, ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకొని, వైద్య చికిత్సలు చేసుకోవాలని తెలిపారు.