విశాలాంధ్ర – ధర్మవరం : ఉపాధ్యాయ ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా ఉపాధ్యక్షుడు సానే రవీంద్రారెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోనంకి అశోక్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం కనపరుస్తుందని, అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ ను రద్దుచేసి,పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోవడం దారుణమని తెలిపారు. జిపిఎస్ లు ప్రవేశపెట్టి ఉపాధ్యాయ ఉద్యోగులను మరోసారి ప్రభుత్వం మోసగించిందని ప్రభుత్వం పై మండిపడ్డారు. వైయస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడి ఐదు సంవత్సరాలు కాలం పూర్తి అయినప్పటికీ నేటికీ ఉపాధ్యాయ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా కొత్త సమస్యలను సృష్టిస్తోందని 11వ పిఆర్సి బకాయిలు వెంటనే చెల్లించాలని, 30 శాతం మధ్యంతర బృతిని ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డి ఏ లు తక్షణమే విడుదల చేయాలని, పాత పెన్షన్ విధానాన్ని తిరిగి పునరుద్దించాలని తెలిపారు. టీచర్ల నియామకంలో మళ్లీ ప్రవేశపెట్టిన విధానములు రద్దుచేసి రెగ్యులర్ స్కేల్లో వారిని నియమించాలని డిమాండ్ చేశారు. మా సమస్యలు పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాల పోరాటాలను సలుపుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ బికే ముత్యాలప్ప, బలరాముడు, నాగేశ్వరి రాష్ట్ర కౌన్సిలర్ శ్రీనివాసులు జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ నాగభూషణ, మండల శాఖల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈశ్వరయ్య, శివానంద, శ్రీనివాసులు, జగదీష్, నరసింహులు, హరిప్రసాద్, పెన్షనర్ల సంఘం నాయకులు చల పతి, హబీబుల్లా, తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.