బాలల హక్కుల రాష్ట్ర కమిషన్ సభ్యులు డాక్టర్ రాజేంద్రప్రసాద్
విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : అనంతపురం నగరంలోని పెన్నర్ భవన్ సమావేశ భవనంలో బుధవారం జిల్లాలోని సంక్షేమ హాస్టళ్ల అధికారులు మరియు రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాళ్లతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు డా. రాజేంద్ర ప్రసాద్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని విద్యాలయాలలో తప్పనిసరిగా పిల్లలకు బాలల హక్కుల గురించి మరియు వాటిని పరిరక్షించడానికి పనిచేస్తున్న వ్యవస్థల గురించి, చైల్డ్ హెల్ప్లైన్ గురించి అవగాహన కల్పించాలని సూచించారు. అంతేగాక రెసిడెన్సియల్ స్కూల్లో పిల్లల సంరక్షణ కొరకు సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, బాలికల వసతి గృహాలలో పురుష సిబ్బంది లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. పిల్లలకు మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ గురించి అవగాహన కల్పించాలన్నారు. బాల్య వివాహాల వలన కలిగే అనర్ధాల గురించి పిల్లలకు తెలియజేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సంక్షేమ హాస్టళ్ల అధికారులు మరియు రెసిడెన్షియల్ స్కూల్ ప్రిన్సిపాల్స్, తదితరులు పాల్గొన్నారు.