విశాలాంధ్ర – ఉరవకొండ : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అరెస్టుకు నిరసనగా ఉరవకొండ పట్టణంలో గురువారం తెలుగుదేశం పార్టీ దళిత విభాగం నాయకులు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించడంతో పాటు రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో పాల్గొని నిరసన తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును అక్రమంగా అరెస్టు చేయడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నిజాయితీ పరుడైన చంద్రబాబునాయుడును అక్రమంగా జైల్లో పెట్టారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పాలనలో దళితుల యొక్క అభివృద్ధికి చంద్రబాబునాయుడు ఎనలేని కృషి చేశారని అలాంటి వ్యక్తిని అక్రమంగా నిర్బంధించడం శోచనీయమన్నారు. గడిచిన 45 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి ప్రజల సంక్షేమం కోసమే పని చేశారని అలాంటి వ్యక్తిని రాజకీయంగా ఎదుర్కోలేక అక్రమ కేసులు నమోదు చేయిస్తుందని వారు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వము యొక్క అవినీతిని, అక్రమాలను ప్రశ్నించిన వారందరిపై కూడా కేసులు పెట్టడం జైలుకు పంపడం చేస్తూ ముఖ్యమంత్రి నియంతల వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. చంద్రబాబు పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ఆ పార్టీ దళిత విభాగం నాయకులతో పాటు టిడిపి సీనియర్ నాయకులు కూడా పాల్గొన్నారు.