విశాలాంధ్ర – అనంతపురం వైద్యం : ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి ప్రాజెక్టు డైరెక్టర్ ఆదేశాల మేరకు యువతలో హెచ్ఐవి,ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు బుధవారం రాజేంద్ర మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ నందు జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం, జిల్లా విద్యాశాఖ సంయుక్త ఆధ్వర్యంలో అనంతపురం జిల్లాలో 8, 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిప్యూటీ విద్యా శాఖాధికారి పద్మ ప్రియ మాట్లాడుతూ కౌమార దశలో ఉన్న విద్యార్థులకు హెచ్ఐవి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రధానోపాధ్యాయురాలు పద్మావతి మాట్లాడుతూ విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, రాష్ట్ర స్థాయిలో కూడా ప్రైజ్ సాధించే విధంగా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు. జిల్లా ఎయిడ్స్ నియంత్రణ డి.పి.యం. వెంకట రత్నం మాట్లాడుతూ కౌమార దశ మరియు యువతకు హెచ్.ఐ.వి./ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి అనేక కార్యక్రమాలు నిర్వహిస్తోందని, ప్రస్తుతం యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో భాగంగా గత 8వ తారీఖున మారథాన్ కార్యక్రమం నిర్వహించామని, ఈ రోజు 8,9 వ తరగతుల విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నామని, అలాగే డ్రామా, రీల్ మేకింగ్ వంటి కార్యక్రమాలు కూడా నిర్వహించ బోతున్నమని, ఈ క్విజ్ పోటీలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి జిల్లాలో ప్రైజ్ మనీ తో పాటు, రాష్ట్ర స్థాయి పోటీ లలో పాల్గొనే అవకాశం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సూపర్వైజర్ జి.వి. రమణ, మురళి, ఆర్ ఎం సి హెచ్ స్కూల్ ఉపాధ్యాయులు దివాకర్ నాయుడు, శ్రీనివాసులు, ఎస్.రామాంజనేయులు, హెచ్.రామాంజనేయులు, హనుమంత రెడ్డి, ఓబులేసు, రవీంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు.