Friday, December 9, 2022
Friday, December 9, 2022

రాజన్న కల నెరవేరింది..!

విశాలాంధ్రబ్యూరో – అనంతపురం : పేరూరు డ్యాంకు నీరు తీసుకొస్తామని 2009లో రాప్తాడులో జరిగిన సభలో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాట ఇచ్చారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో నీళ్లు తీసుకొచ్చామని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం రామగిరి మండలం పేరూరు డ్యాం నుంచి దిగువ ప్రాంతానికి నీళ్లొదలడానికి ఎమ్మెల్యే గేట్లు ఎత్తారు. ముందుగా డ్యాంలో గంగ పూజ చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం కోసం భగీరథ ప్రయత్నం జరిగితే భగవంతుడు ఆశీర్వదించాడన్నారు. డ్యాంకు నీరు రావడంతో రాజన్న కల నెరవేరిందన్నారు. హంద్రీ నీవా నీళ్లు తురకలాపట్నం వద్ద వదిలి అక్కడి నుంచి పెన్నానది కాలువల ద్వారా 2020 నుంచి వరుసగా మూడేళ్లు డ్యాంకు నీళ్లు తీసుకొచ్చామన్నారు. పైనుంచి దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశీర్వాదం ఉంది కాబట్టే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. నదులు పరవళ్లతో కళకళలాడుతున్నాయి. వర్షాలు బ్రహ్మాండంగా పడుతుండడంతో భూగర్భజలాలు పెరుగుతున్నాయన్నారు. రైతులు పంటలు బాగా సాగు చేసుకుంటున్నారు. ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. జిల్లాలో ప్రతి చెరువుకూ నీళ్లొచ్చాయి. ప్రతి డ్యామూ నిండింది. తెలుగుదేశం ప్రభుత్వంలో రైతులు ఆత్మహత్యలు, పలసలు, ఆకలి బాధలకు గురయ్యారన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత భగవంతుడి దయతో ఆ గాయాలు మరిచిపోయి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు.

అదనంగా రెండు టీఎంసీల నీరు.!

కర్నాటక ప్రాంతంలో వర్షాలు బాగా కురపడంతో నాగలపుడక మీదుగా పేరూరు డ్యాంకు నీళ్లు చేరుకున్నాయని ఎమ్మెల్యే తెలిపారు. డ్యాం దాదాపు నిండిపోయిందన్నారు. 12 వేల క్యూసెక్కుల ఇన్లో వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. చరిత్రలో ఎన్నడూ కూడా రెండు రోజుల్లో పేరూరు డ్యాం నిండేంత నీళ్లు రాలేదన్నారు. నాగలమడక డ్యాం వద్ద 13 వేల క్యూసెక్కుల ఔట్ చూపిస్తోం దన్నారు. జయమంగిరి నది పినాకాని నదితో కలిసిందన్నారు. హగిరి చెరువు మరువ పారుతోందన్నారు. రొద్దం బ్రిడ్జిపై నీళ్లు పోతున్నాయన్నారు. నాగలమడక చెక్ డ్యాం మీద నాలుగు అడుగుల మేర ఫ్లో అపుతోందన్నారు. కనీసం రెండు టీఎంపీల నీళ్లు పేరూరు డ్యాం కెపాసిటీ కంటే అదనంగా వచ్చే అవకాశం ఉందన్నారు. అందుకోసమే దిగువ ఉన్న పెన్నానది గర్భంలోకి నీళ్లు వదిలామన్నారు. దీంతో కంబదూరు, బెళుగుప్ప, ఆత్మకూరు, కనగానపల్లి మండలాల్లో పూర్తిగా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉందన్నారు. చివరిగా పీఏబీ ఆర్ డ్యాంకు నీరు చేరుతుందన్నారు.ఈ కార్యక్రమంలో రాప్తాడు సీనియర్ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి , మండల కన్వీనర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వైస్ ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మండల నాయకులు, కార్యకర్తలు మరియు అధికారులు పాల్గొన్నారు..

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img