Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి పేదల పక్షపాతి

విశాలాంధ్ర -ఉరవకొండ : పేదల పక్షపాతిగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా కామ్రేడ్ రాకెట్ల నారాయణ రెడ్డి నిలిచిపోయారని పేద ప్రజలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని పలువురు వక్తలు కొనియాడారు కమ్యూనిస్టు పార్టీ నాయకులు కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి 28వ వర్ధంతి కార్యక్రమాన్ని బుధవారం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. నారాయణరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు శివన్న, ఆ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు కేశవరెడ్డి, రాకెట్ల నారాయణరెడ్డి కుమారుడు మధుసూదన రెడ్డి, సిపిఐ పార్టీ తాలూకా కార్యదర్శి మల్లికార్జున, సిపిఎం పార్టీ నాయకులు రంగారెడ్డి మధుసూదన్ నాయుడు తదితరులు మాట్లాడుతూ నారాయణరెడ్డి యొక్క గొప్ప ఆశయాలను కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విద్యార్థి దశ నుండే వామపక్ష భావాలు వైపు ఆకర్షితులయ్యారని ధనిక రైతు కుటుంబంలో జన్మించిన తన జీవితం పేదల సంక్షేమం కోసం సోషలిస్టు వ్యవస్థ నిర్మాణానికి కృషిచేసిన ఆదర్శనీయులుని పేర్కొన్నారు 1950 సంవత్సరంలో అనంతపురం ఆర్ట్స్ కాలేజీలో ఏఐఎస్ఎఫ్ నాయకుడిగా పనిచేసి విద్యార్థి సంఘాన్ని జిల్లా వ్యాప్తంగా విస్తరింప చేశారని పేర్కొన్నారు. తర్వాత కమ్యూనిస్టు రాజకీయాలలో చురుగ్గా పాల్గొనడం జరిగిందన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి గ్రామాలలో వ్యవసాయ కూలీలు. పేద రైతులు, దళితులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి అలుపెరుగని పోరాటాలు నిర్వహించారన్నారు. పార్టీపై నిషేధం అమలైన రోజుల్లో ప్రభుత్వం అరెస్టు చేసి చాలా కాలం జైల్లో పెట్టడం జరిగిందన్నారు. ఉరవకొండ తాలూకా కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే చల్లపల్లి జమిందార్లపై జరిగిన భూ పోరాటం తరహాలో జరిగిన అతిపెద్ద భూ పోరాటం కౌకుంట్లలో నారాయణ రెడ్డి నాయకత్వంలో జరిగిందని ఈ పోరాటంలో కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులైన చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్. ఆంజనేయ శాస్త్రి నీలం రాజశేఖర్ రెడ్డి, వి కే ఆదినారాయణ రెడ్డి, సదా శివన్ తదితరులు పాల్గొనడం విశేషం అన్నారు. ఈ ఉద్యమానికి స్పందించి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ స్వయంగా కౌకుంట్లలో 1200 ఎకరాల భూమిని భూ సమారాధన. పేరుతో పేదలకు పంపిణీ చేయడం జరిగిందని ఇది ఉమ్మడి రాష్ట్ర చరిత్రలోనే అతిపెద్ద భూ పోరాటమని కొనియాడారు. ఈ పోరాటం జిల్లాలో కమ్యూనిస్టుల ప్రతిష్టను మరింతగా పెంచిందన్నారు.నారాయణ రెడ్డి ఎంతో సౌమ్యుడు. వ్యక్తిగతంగా ఏ ఒక్కరి పట్ల శత్రుత్వభావంతో ఉండేవారు కాదని పేర్కొన్నారు. ప్రజలతో నిత్యం కలిసిపోయి వారికి అన్యాయం ఎక్కడ జరిగినా అక్కడ కి వెళ్లడం ఆయన జీవన విధానంగా మార్చుకున్నారని తెలిపారు. పేదలలో ఆయన పట్ల పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేని భూస్వాములు ఆయనను ప్రత్యక్షంగా ఎదుర్కోలేక దొంగ దెబ్బ తీశారు. భూస్వాములు తోడ్పడుతో 1995 మే 24న నారాయణ రెడ్డి తో పాటు వారి కుమారుడు రవీంద్రనాథ్ రెడ్డిని కూడా అత్యంత కిరాతకంగా హత్య చేయడం జరిగిందన్నారు. ఇది అత్యంత విషాదకరమైన సంఘటనని అన్నారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆదర్శాలు, ఆశయాలు ఇప్పటికీ మిగిలే ఉన్నాయని వాటిని ప్రతి ఒక్కరు కూడా కొనసాగించాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు ఆయనను భౌతికంగా హత్య చేసిన ఆయన పోరాటాల ద్వారా సాధించిన ఫలితాలు ప్రజల పొందుతున్నంతకాలం ప్రజల గుండెల్లో ఆయన జీవించే ఉంటారని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ తాలూకా సహాయ కార్యదర్శి మనోహర్, ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు లీలా దర్ ప్రసాద్, వీరయ్య, ఏఐటీయూసీ నాయకులు చెన్నారాయుడు, సీనియర్ నాయకులు శ్రీధర్, సిపిఐ నాయకులు సుల్తాన్, మల్లేష్, శ్రీరాములు, మల్లికార్జున, నాబిసాహెబ్, రమేష్ ,కృష్ణ,సుంకర రాజు, మహిళా సంఘం నాయకులు ఒన్నూరమ్మ , విద్యార్థి సంఘం నాయకులు ఆంజనేయులు వీరితోపాటు రాకెట్ల నారాయణరెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంతకుముందు మండల పరిధిలోని రాకెట్ల గ్రామంలో కామ్రేడ్ రాకెట్ల నారాయణరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి యొక్క సమాధుల వద్ద కుటుంబ సభ్యులు ఘనంగా నివాళులు అర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img