విశాలాంధ్ర- ఉరవకొండ : డాక్యుమెంట్లు రూపకల్పన విధానాన్ని ఆన్లైన్లో ప్రభుత్వం తీసుకురావడాని నిరసిస్తూ గురువారం రెండవ రోజు ఉరవకొండ లో స్థానిక రిజిస్టర్ కార్యాలయం ముందు డాక్యుమెంట్ రైటర్లు మరియు వెండర్లు నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ సంఘం నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానానికి నిరసనగా రెండు రోజులపాటు తాము పెన్డౌన్ కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలిపామన్నారు. ఆన్లైన్ లోనే డాక్యుమెంట్ను తయారు చేసుకుని చలానా చెల్లించి టైం స్లాబ్ ఏర్పాటు చేసుకుని రిజిస్ట్రేషన్ కార్యాలయంలోనూ
గ్రామ, వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు. దీనివల్ల అమ్మకం దారులను కొనుగోలు దారులను కూడా మోసం చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయన్నారు. అంతేకాకుండా ఈ కొత్త విధానం వల్ల రాష్ట్ర ప్రభుత్వం డాక్యుమెంటరీ రైటర్ల కడుపు కొడుతుందని వారు ఆరోపించారు. ప్రభుత్వం ఇప్పటికైనా నూతన విధానాన్ని ఉపసంహరించుకోవాలని డాక్యుమెంట్ రైటర్లు మరియు వెండర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.