విశాలాంధ్ర, పెద్దకడబూరు :మండల కేంద్రమైన పెద్దకడబూరులోని స్థానిక రేయిన్ బో ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాల నందు గురువారం పాఠశాల కరస్పాండెంట్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శ్రీకృష్ణ విగ్రహంను అధిష్టించి ప్రత్యేక పూజలు చేశారు. చిన్నారులు గోపిక, శ్రీకృష్ణ వేషాదారణలో ఆకట్టుకొన్నారు. గోపీక, శ్రీకృష్ణ వేషాదారణలో ఉన్న చిన్నారులు ఉట్టి ఉత్సవములో రంగులు చల్లుకుంటూ సంబరాలు చేసుకున్నారు. చిన్ని కృష్ణుడు వేషాదారణలో అబ్బాయిలను, రాధా, గోపికల వేషాదారణలో అమ్మాయిలను అందంగా ముస్తాబు చేశారు. అనంతరం కరస్పాండెంట్ గోవిందరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులకు చిన్ననాటి నుంచే పండుగల విశిష్టతను తెలియజేయాల్సిన బాధ్యత ఉందన్నారు. మన దేశ సంస్కృతి, సాంప్రదాయాలు ఎంతో గొప్పవన్నారు. ఈ వేడుకలలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.