Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

బిఎస్ఎఫ్ ఉమామహేశ్వర్ ఆకస్మిక మృతి

విశాలాంధ్ర – ధర్మవరం : పట్టణంలోని 25 వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ తమ్ముడు పసల పూజారి ఉమామహేశ్వర్ శుక్రవారం ఢిల్లీలో ఉదయం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఈ సందర్భంగా 25వ వార్డు కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ మాట్లాడుతూ గత 18 సంవత్సరాలుగా ఆర్మీలో విధులు కొనసాగిస్తూ మంచి గుర్తింపును పొందడం జరిగిందన్నారు. ఆర్మీలో సెలవులు ఇచ్చినప్పుడు మాత్రమే చెన్నై కొత్తపల్లి మండలం మేడాపురం గ్రామానికి వచ్చే వారిని తెలిపారు. చిన్నతనం నుండే దేశభక్తి అంటే ఎంతో అమితమైన ప్రేమ అని తెలిపారు. పట్టు పట్టి ఆర్మీలో చేరడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం మా తమ్ముడు ఢిల్లీలోని జి 20 విభాగంలో విధులు నిర్వహిస్తుండగా, శుక్రవారం తెల్లవారుజామున చాతి నొప్పి రావడంతో సంబంధిత ఆర్మీ ఉద్యోగులు హుటాహుటిన ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. తమ్ముడు యొక్క సమాచారాన్ని మాకు ఆర్మీ వారు తెలిపారు. ఇంత చిన్న వయసులోనే మృతి చెందుతాడు అన్న విషయాన్ని మేము జీర్ణించుకోలేకున్నామని తెలిపారు. పూజారి ఉమామహేశ్వర్ మృదు స్వభావం కలవాడని, అజాతశత్రువుగా మేడాపురంలోనూ, ఢిల్లీలోనూ మంచి పేరున్న వ్యక్తి అని తెలిపారు. అంతేకాకుండా మరణించిన తర్వాత తన రెండు కళ్ళను ఢిల్లీలో నేత్రదానం చేయడం జరిగిందన్నారు. మృతునికి భార్య లలితమ్మ, కుమారులు వంశీకృష్ణ పవన్ లు ఉన్నారు. మేడాపురం గ్రామం అంతా శోక సముద్రంలో మునిగిపోయింది. కుటుంబంలోని వ్యక్తిని కోల్పోవడంతో కుటుంబం బంధువులు కన్నీటి పర్యంతం అయ్యారు. పూజారి ఉమామహేశ్వర్ మృతదేహం బెంగళూరు ద్వారా స్వగ్రామం మేడాపురం కు శనివారం తెల్లవారుజామున చేరుతుందని వారు తెలిపారు. అనంతరం పట్టణంలోని పలువురు కౌన్సిలర్లు, స్నేహితులు, కౌన్సిలర్ మేడాపురం వెంకటేష్ గృహానికి చేరుకొని తమ సంతాపాన్ని తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img