ఆరు బోర్లు వేసినా చుక్క నీరు రాని వైనం
ఎన్ పీ కుంటలో లబోదిబోమంటున్న రైతులు
విశాలాంధ్ర, ఎన్ పి కుంట : ఖరీఫ్ సీజన్ లో వేరుశనగ పంట సాగు చేసిన రైతులు సకాలంలో వర్షాలు కురవక పోవడంతో అన్నదాతలు లబోదిబోమంటున్నారు. సాగు చేసిన వేరుశనగ పంట కాపాడుకునేందుకు రైతులు తమ పొలంలో ఎన్ని బోర్లు వేసిన నీరు లభ్యం కావడం లేదని రైతులు వివరిస్తున్నారు. పోరెడ్డి వారి పల్లి చెందిన రైతు తమ్మతక్క ఉత్తన్న తనకున్న 6 ఎకరాల పొలంలో జూన్ 6 వ తేదీన వేరుశనగ పంటను సాగు చేశానని, అయితే సాగు చేసిన నాటి నుంచి వర్షం పడకపోవడంతో పంట తీవ్రంగా దెబ్బతినిందని, పంట ఏండి పోతుండడంతో ఆరు బోర్లు వేశానని బోర్లలో నీరు లభ్యం కాలేదన్నారు. ఒక బోరును వెయ్యి అడుగులకి పైగా వేశానని చుక్క నీరు లభ్యం కాలేదనీ అన్నారు. ఒక్క బోరులో మాత్రం కొద్దిగా నీరు పడిందని రెండు స్ప్రింక్లర్ల నీళ్లు వస్తోందని తెలిపారు. ఆ బోరులో వస్తున్న కొద్దిపాటి నీరు అరగంట మాత్రమే వచ్చి నిలిచిపోతున్నదని రైతు ఉత్తన్న పేర్కొన్నారు. తనకున్న పొలంలో వేసిన బోర్లతో తనకు ఎక్కువ అప్పులు అయిపోయాయని తాను దిక్కు తోచని స్థితిలో ఉన్నానన్నారు. పంట సాగుకు రెండు లక్షల పైగా పెట్టుబడి పెట్టానని, వ్యవసాయ బోర్లకు ఆరు లక్షల పైగా పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయారని రైతు వివరించారు. బోర్లకు, పంట సాగుకు, మోటార్ ఏర్పాటుకు తాన సుమారు రూ. 12 లక్షల పైగా అప్పులు చేసి పంటలకు పెట్టుబడి పెట్టాననీ అన్నారు. రానున్న రోజుల్లో పంట దిగుబడులు ఆశించిన స్థాయిలో లేకపోతే తాను చేసిన అప్పులు ఎలా తీర్చుకోవాలో దిక్కు తోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నట్లు కుటుంబ సభ్యులు వివరించారు. తనకున్న పొలాన్ని నమ్ముకుని వ్యవసాయ బోర్లు వేయడంతో అప్పుల అధికమయ్యాయని అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేని దుస్థితిలోకి వెళ్లిపోయారని రైతు ఆవేదన చెందుతున్నాడు. రైతు సాగు చేసిన వేరుశనగ పంటను పరిశీలించడానికి మండల సిపిఐ ,సిపిఎం నాయకులు సందర్శించారు. రైతు పెట్టిన పంటను పరిశీలించి తీవ్రంగా నష్టాన్ని చూశారని రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఐ మండల కార్యదర్శి పంకమద్ది జి రమణ, సిపిఎం రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు జవుకుల వేడి గింజల నాగిరెడ్డి, సి. ముత్యాలప్ప డిమాండ్ చేశారు. రైతులు ఒక ఎకరా వేరుశనగ పంట సాగు చేయడానికి రూ.40 ఖర్చు చేయాల్సి ఉందన్నారు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడులు సైతం రైతు కోల్పోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఖరీఫ్ లో వేరుశనగ సాగు చేసిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్టపరిహారంను అందించి ఆదుకోవాలని, ప్రభుత్వం ఆదుకునే పక్షంలో రైతులు అప్పుల వాళ్ళ వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం మండలంలో అధికంగా నెలకొందని సిపిఐ ,సిపిఎం పార్టీ నాయకులు ఈ సందర్భంగా వివరించారు. మండలంలో నెలకొన్న కరువు పరిస్థితులను అధిగమించాలంటే హంద్రీనీవా కాలవ ద్వారా నీటిని మండలంలోని చెరువులకు హంద్రీనీవా నీటితో నింపాలని సిపిఐ ,సిపిఎం నాయకులు వివరించారు.