Tuesday, September 26, 2023
Tuesday, September 26, 2023

జగనన్న కాలనీలలో సరి అయిన సౌకర్యాలు లేవు…

ప్రజల్ని అప్పులపాలు చేసిన ఘనత వైఎస్ఆర్సిపి కే దక్కింది

జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి.
విశాలాంధ్ర- ధర్మవరం : జగనన్న కాలనీలో వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చాక ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, పట్టాలు పుచ్చుకున్న లబ్ధిదారులందరూ కూడా అప్పుల పాలు అయి ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం రాష్ట్ర పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు జగనన్న కాలనీల లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన జిల్లా నిర్మాణంను సందర్శించారు. ఈ సందర్భంగా ఇళ్ల నిర్మాణ పనులను వారు స్వయంగా పరిశీలించారు. అంతేకాకుండా జగనన్న కాలనీల యొక్క రోడ్ల యొక్క దుస్థితి కూడా పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ జగనన్న కాలనీలలో జరుగుతున్నటువంటి మోసాలు గూర్చి ప్రజలకు తెలియజేశారు. ఈ జగనన్న కాలనీలలో పేదలకు ఇచ్చిన గృహాలు వంకల్లోనూ, వాగుల్లోనూ, పట్టాలు ఇచ్చి ,పేదలను మోసం చేశారని ముఖ్యమంత్రి పై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రోడ్లు వేయడం కానీ, విద్యుత్ సరఫరా చేయడం కానీ చేసిన పాపాన పోలేదని మండిపడ్డారు. కాలనీలలో నడవలేని దుస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ప్రజలు ఒక్క ఛాన్స్ ఇవ్వండి …అన్న జగనన్న మాటను నమ్మి, దారుణంగా ప్రజలు మోసపోయారని విరుచుకుపడ్డారు. అలాగే ఈ ప్రభుత్వం దాదాపుగా 6 లక్షల కోట్లు అప్పుచేసి ఎవరికోసం ఖర్చు పెట్టారని వారు ప్రశ్నించారు. ఆ డబ్బులు కేవలం పార్టీ కార్యకర్తల కోసమే అక్కడక్కడ ఇల్లులు కట్టించారని, పేద ప్రజలను పట్టించుకున్న పాపాన పోలేదని వారు మండిపడ్డారు. తమ జనసేన పార్టీ అధికారంలోకి వచ్చాక, ఈ కాలనీలను పరిశీలించి అభివృద్ధి బాటలో నడుపుతామని హామీ ఇచ్చారు. అంతేకాకుండా జగనన్న కాలనీ పేరును మారుస్తామని, ఎందుకంటే జగనన్న స్వాతంత్ర సమరయోధుడు కాదని వారు తెలిపారు. ఏది ఏమైనా ప్రతిపక్షాలు గాని జనసేన పార్టీ గాని ప్రజా వ్యతిరేక పనులను ప్రశ్నిస్తే, ప్రజల సొమ్ముతో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి,జనసేన పార్టీ అధినేతను తిట్టేందుకే ఇటువంటి కార్యక్రమాలు పెట్టుకోవడం ప్రజలందరికీ తెలిసిపోయిందని తెలిపా రు. ఇప్పటికే రాష్ట్ర ప్రజలు వైయస్సార్ ప్రభుత్వంపై విసుగు చెందారని, వచ్చే ఎన్నికల్లో తప్పకుండా జనసేన పార్టీ అధికారంలోకి వస్తుందని తెలిపారు. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల సమస్యలను కష్టాలను మాత్రమే ప్రభుత్వాన్ని అడుగుతుందని, ఆ సమస్యకు సమాధానం చెప్పడం చేతకాని ప్రభుత్వమని తెలిపారు. ప్రజల కోసం, ప్రజా పరిపాలన కోసం జనసేన పార్టీ ఎప్పుడూ కూడా నిరంతరం పోరాట ఉద్యమాలను చేస్తూనే ఉంటుందని తెలిపారు. అక్రమ కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు బనాయించి, స్టేషన్కు తరలించడం లాంటి పనులకు తాము బెదిరేది లేదని వారు స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img