- *: జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి
విశాలాంధ్ర – అనంతపురం : వివిధ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణలో ఎలాంటి జాప్యం ఉండరాదని, ప్రత్యేక దృష్టి పెట్టి భూసేకరణ వేగంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ఐ.ఏ.ఎస్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం అనంతపురం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ లో వివిధ జాతీయ రహదారులు, పవర్ గ్రిడ్, రైల్వే, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎన్.హెచ్- 544డి, ఎన్.హెచ్ – 67, ఎన్.హెచ్ -42, పవర్ గ్రిడ్, సోలార్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్, రైల్వేకి సంబంధించి వివిధ ప్రాజెక్టులు, ఎపిఐఐసి, ఇతర ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన చేపట్టాలన్నారు. ఆయా ప్రాజెక్టుల కింద అవసరమైన చోట్ల వారం రోజుల లోపల గ్రామసభలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆర్డీఓలు, తహసీల్దార్ లకు సూచించారు. అటవీ పరిధిలో జాతీయ రహదారుల పనులలో చెట్లను తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. భూసేకరణ కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం అందించేలా చూడాలన్నారు. ఆయా శాఖల అధికారుల మధ్య సమన్వయం ఉండాలని, భూసేకరణ సజావుగా నిర్వహించాలని, నివేదికలను సకాలంలో పంపించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదన్నారు. కోర్టు కేసులు ఉంటే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా ప్రాజెక్టులకు భూసేకరణకు సంబంధించి సమయం పడుతోందని, త్వరితగతిన భూసేకరణ పూర్తి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఈ సమావేశంలో డిఆర్ఓ జి.రామకృష్ణారెడ్డి, నేషనల్ హైవే డిఈ రామచంద్రారెడ్డి, ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ సంపత్ కుమార్, ఎడి వివేకానంద స్వామి, సర్వే ఏడి రూప్ల నాయక్, ఆర్డీఓ కార్యాలయం డిఏఓ విజయలక్ష్మి, తహసీల్దార్ పుణ్యవతి, ట్రాన్స్ కో ఈఈ శ్రీధర్, కలెక్టరేట్ జి-సెక్షన్ సూపరింటెండెంట్ రియాజుద్దీన్, నేషనల్ హైవే టెక్నికల్ మేనేజర్ మురళి, అసిస్టెంట్ టెక్నికల్ మేనేజర్ సాయి కృష్ణ, వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.