విశాలాంధ్ర-రాప్తాడు : పేయి దూడల ఉత్పత్తి పథకంతో అనంతపురం జిల్లాలోని రాప్తాడు మండలం ఎం.బండమీదపల్లి గ్రామంలో మొట్ట మొదటి పెయిదూడ సోమవారం జన్మించింది. ఈసందర్భంగా పశు సంవర్థకశాఖ జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ కార్య నిర్వహణ అధికారి డాక్టర్ సుధాకర్, రాప్తాడు ఏరియా ఏడీ డాక్టర్ ఆర్.ప్రకాష్, స్థానిక పశువైద్యాధికారి డాక్టర్ సోమేశ్వరి మాట్లాడుతూ ప్రభుత్వం పాడి రైతుల అభి వృద్ధికి నూతనంగా ప్రవేశపెట్టిన పేయి దూడల ఉత్పత్తి పథకాన్ని పాడిరైతులు సద్వినియోగం చేసు కోవాలని కోరారు. 90% కచ్చితత్వంతో పేయి దూడల పుట్టుకను ఉద్దేశించి లింగ నిర్ధారిత వీర్యంతో గ్రామంలో కృత్రిమ గర్భధారణ ఇంజక్షన్లు 23 పశువులకు వేయగా 15 పశువులకు కట్టు నిలిచిందన్నారు. రూ.1350 విలువ గల రెండు సూదులకు రూ.850 సబ్సిడీ పోగా రూ.500లు మాత్రమే పేయిదూడలను పొందే సూదులను ప్రభుత్వం సరఫరా చేయడం చాలా లాభదాయకమన్నారు. పైగా రెండు సూదులు వేసినా కట్టు నిలవకపోతే రూ.500, పొరపాటున కుర్ర దూడ పుడితే రూ.250 వాపస్ ఇస్తామన్నారు. కావలసిన బ్రీడ్ లను ఎంపిక చేసుకోవాలని, పుట్టేది పెయిదూడ కనుక ప్రసవించేటప్పుడు ఆవుకు కష్టం లేకుండా ప్రసవించడం ప్రత్యేక లాభదాయకమైన అంశాలన్నారు. ఇందులో భాగంగా ఎం.బండమీదపల్లి గ్రామానికి చెందిన యు. నరసింహులు అనే రైతు గతేడాది నవంబర్ 4వ తేదీన తన ఆవుకి పెయ్య దూడల సూది వేయించగా.. ఆ ఆవు సోమవారం పెయ్యదూడకి జన్మనిచ్చిందన్నారు. పెయ్యదూడల సూది వేయించుకొని, పెయ్యదూడ పుట్టినందుకు, పాడిలో ఒక పశుసంపద పెరిగిందని నరసింహులు తమ సంతోషాన్ని పంచుకున్నారు. భవిష్యత్తులో ఈ లింగ నిర్ధారిత వీర్యము అత్యధిక ప్రాచుర్యం పొందుతుందని, ఈగ్రామములో అత్యధిక పాడి కొరకు పేయిదూడలు మాత్రమే పొందే ఆధునికత సాంకేతిక విప్లవముగా ఈ పథకం మారగలదని వైద్యులు ఆశాభావం వ్యక్తం చేశారు. .