జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు, నూతన చట్టాలపై అవగాహన సదస్సులు చేపట్టిన పోలీసులు
విశాలాంధ్ర – అనంతపురం : జిల్లా ఎస్పీ కె.వి.మురళీకృష్ణ ఆదేశాలతో పోలీసులు విజిబుల్ పోలీసింగ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా వాహనాల తనిఖీలు, నూతన చట్టాలపై అవగాహన సదస్సులు చేపట్టారు. జాతీయ/రాష్ట్రీయ/జిల్లా రహదారులు మరియు జిల్లా కేంద్రం, మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాలలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. రహదారి భద్రతా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. గంజాయి, తదితర మాదక ద్రవ్యాలు… అక్రమ మద్యం, నాటు సారా, తదితరాలు అక్రమ రవాణా జరుగకుండా వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అంతేకాకుండా… ఈ ఏడాది జులై నెల నుండీ అమల్లోకి వచ్చిన నూతన చట్టాలపై సదస్సులు నిర్వహించి ప్రజల్లో అవగాహన చేశారు. ఈసందర్భంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ… ద్విచక్ర వాహనం నడిపే సమయంలో ప్రతి ఒక్కరు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలన్నారు. వాహనాలు నడిపే సమయంలో మీపై మీ కుటుంబ సభ్యులు ఆధారపడి ఉన్నారన్న విషయాన్ని గుర్తుంచుకుని రోడ్డు భద్రతా నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు.