కూటమి ప్రభుత్వంలో ఎరుకుల కార్పొరేషన్ తీసుకొస్తాం
అనంత అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్
విశాలాంధ్ర – అనంతపురం : అనంతపురం నగరంలో ఏకలవ్యుని విగ్రహం ఏర్పాటు కోసం కృషి చేస్తామని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ హామీ ఇచ్చారు. నవోదయ కాలనీలో ఉమా మహేశ్వరి ఏకలవ్యుని మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఏకలవ్యుని జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ముందుగా జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏకలవ్యుని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ… విలువిద్యలో ఏకలవ్యునికి సాటి మరెవరూ లేరని అన్నారు. ఎలాంటి శిక్షణా లేకుండా విలువిద్య నేర్చుకున్నారని గుర్తు చేశారు. ఆరోజు గురువు అడిగారన్న ఒకే ఒక కారణంతో బ్రోటనవేలును కోసిచ్చారని అన్నారు. ఆయన ప్రతిభ నేటి తరానికి ఆదర్శమన్నారు. మరోవైపు ఎన్నికల ముందు ఎరుకుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వంలో ఎరుకుల కోసం కార్పొరేషన్ తీసుకొస్తామని.. ఇందుకోసం తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. నగరంలో ఏకలవ్యుని విగ్రహం లేదని ఎరుకుల సంఘం నాయకులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లగా ఆయన సానుకూలంగా స్పందించారు. మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఖచ్చితంగా విగ్రహం ఏర్పాటుకుకృషి చేస్తామని ఎమ్మెల్యే దగ్గుపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సి ఎస్టి జేఏసీ అధ్యక్షుడు సాకే హరి, ఆంధ్రప్రదేశ్ ఎరికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు చిరంజీవి, సంఘం రాష్ట్ర నాయకులు సాకే వీర, సుధాకర్ తదితర నాయకులు పాల్గొన్నారు.