విశాలాంధ్ర-రాప్తాడు : రైతు సంక్షేమానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తూ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోందని జెడ్పీ ఛైర్మన్ బోయ గిరిజమ్మ అన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయంలో సోమవారం రాప్తాడు నియోజకవర్గానికి చెందిన 285మంది షెడ్యూల్ కులాల రైతులకు రూ.28.50లక్షలు విలువ చేసే కిచెన్ గార్డెన్ కూరగాయల విత్తనాల కిట్లు, పరికరాలను ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. జెడ్పీ ఛైర్మన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి అనుసూచిత జాతి అభ్యుదయ యోజన పథకం (పిఎంఎజెఎవైౖ) కింద నియోజకవర్గంలో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న ఎస్‌సి రైతులకు ఒక్కొక్కరికి రూ.10 వేలు విలువ చేసే వివిధ విత్తనాల కిట్టును రాయితీతో సరఫరా చేశామన్నారు. కందులు, పెసలు, వేరుశెనగ, రాగులు, కొర్రలు సజ్జలు, జొన్నలు, మొక్కజొన్నలు, సెనగలతో పాటు కిచెన్ గార్డెన్ కిట్ తదితరాలు పంపిణీ చేశామని… ఈ కిట్లను రైతులు సద్వినియోగం చేసుకుని సేంద్రియ వ్యవసాయ పద్దతుల్లో పండించి ఆర్థికంగా ఎదగాలన్నారు. గత ప్రభుత్వాలు రైతులను విస్మరించాయని వైసీపీ ప్రభుత్వం రైతును లక్ష్యాధికారిగా చేసేందుకు కృషి చేస్తోందన్నారు. ఎస్‌సి కార్పొరేషన్ ఈడీ సారయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గాల అభివృద్ధికి ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఒక్కొక్క ఎస్సీ రైతుకు సీడ్ టు సీడ్ కిట్లు, గట్ల మీద వేసేందుకు కంది, కిచెన్ గార్డెన్ కిట్లను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సాల్మన్, ఏఈఓ శంకరయ్య, ఏడీఏ రవి, సత్యసాయి జిల్లా అగ్రిబోర్డు ఛైర్మన్ రమణారెడ్డి, ఎంపీపీలు చిట్రెడ్డి జయలక్ష్మి, గుజ్జల వరలక్ష్మి, ఏఓ శేఖర్ రెడ్డి, వైసీపీ కన్వీనర్ జూటూరు శేఖర్, వైస్ ఎంపీపీలు, అనంతపురం రూరల్, రాప్తాడు అగ్రిబోర్డు చైర్మన్లు సుబ్బారెడ్డి, కేశవరెడ్డి, సర్పంచ్ సాకే తిరుపాలు, మరూరు ఆది, మన్నల రవి, జడ్బీఎన్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.