నాలుగు మండలాల్లోనూ స్పష్టమైన ఆధిక్యం ఎమ్మెల్యే నల్లమిల్లి
విశాలాంధ్ర – అనపర్తి: స్థానిక సంస్థల ఎన్నికల్లో అనపర్తి నియోజకవర్గంలో కూటమి క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించబోతున్న కూటమి అభ్యర్థులందరికీ ఆయన ముందుగానే శుభాకాంక్షలు తెలిపారు.గురువారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో ఆయన పర్యటించారు. పోలింగ్ సరళిని పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఉదయం నుంచి పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ఓటర్లు స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తున్నారు. ఉదయం నుంచి ఓటింగ్ సరళి చూస్తే కూటమికి స్పష్టమైన ఆధిక్యం కనిపిస్తోంది” అని నల్లమిల్లి చెప్పారు.
నాలుగు మండలాల్లోనూ పర్యటించానని, నాలుగు ఎంపీపీ స్థానాలు, నాలుగు జెడ్పీటీసీ స్థానాలను కూటమి కైవసం చేసుకుని అనపర్తిలో కూటమి విజయబావుటా ఎగరవేయడం ఖాయమని అన్నారు.మొన్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూటమి ఏ విధంగా క్లీన్ స్వీప్ చేసిందో, అదే విధంగా ఈ పరిషత్ ఎన్నికల్లోనూ విజయం సాధిస్తాం అని ఆయన అన్నారు.
ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకుంటూ కూటమి ప్రభుత్వానికి మద్దతు పలుకుతున్న ఓటర్లందరికీ ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. తన స్వగ్రామైన రామవరం లో కుటుంబ సభ్యులతో కలిసి ఆయన ఓటు హక్కు వినియోగించుకున్నారు.


