సీఎంగారూ వాగ్దానాలు నెరవేర్చండి
జల్లి విల్సన్ డిమాండ్
నాలుగో రోజూ కొనసాగిన అగ్రిగోల్డ్ బాధితుల రిలే దీక్షలు
విశాలాంధ్ర`విజయవాడ : పేదల ఆశలను సొమ్ముగా మార్చుకుని అగ్రిగోల్డ్ కంపెనీ బోర్డు తిప్పేసింది. మీ వాగ్దానాలు నమ్మి ఓట్లు వేసి గెలిపించారు. మీ వాగ్దానాలను తక్షణమే అమలు చేయండి. కాయకష్టం చేసుకుని బతికే పేదలు ఆరున్నరేళ్లుగా అల్లాడుతున్నారు… ఆదుకోండి. వారు కోల్పోయిన డబ్బును తిరిగి ఇప్పించండి. ఆత్మగౌరవాన్ని కాపాడండి. ఆత్మహత్యలను నివారించండి…’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అనేకమంది నాయకులు విజ్ఞప్తిచేశారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యాన నగరంలో చేపట్టిన రిలే నిరాహారదీక్షలు నాలుగో రోజు ఆదివారం కూడా కొనసాగాయి. నెల్లూరు, తూర్పుగోదావరి జిల్లాలకు చెందిన అగ్రిగోల్డ్ బాధితులు దీక్షలో కూర్చుకున్నారు. నాలుగో రోజు దీక్షలను ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు జల్లి విల్సన్, సామాజిక విశ్లేషకుడు టి.లక్ష్మీనారాయణ ముఖ్య అతిథులుగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్లి విల్సన్ మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల సమస్య న్యాయమైనదని, వారు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని అన్నారు. ప్రభుత్వ ఖజానా నుంచి పైసా కూడా చెల్లించాల్సిన అవసరం లేదని, జప్తు చేసిన అగ్రిగోల్డ్ సంస్థ ఆస్తులను వేలం వేయడం ద్వారా వచ్చిన డబ్బుతో బాధితులకు వడ్డీతో సహా చెల్లించవచ్చని సూచించారు. వేలం ప్రక్రియకు ముందుగా ప్రభుత్వం డబ్బులు చెల్లించి కోర్టు ఆక్షన్ తదుపరి జమ చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ బాధితులను క్షోభకు గురి చేయడం న్యాయం కాదన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందించి పార్టీలకు, రాగద్వేషాలకు అతీతంగా ఈ సమస్య పరిష్కారానికి చొరవచూపాలని కోరారు.
ప్రభుత్వానిదే బాధ్యత : టి.లక్ష్మీనారాయణ
టి.లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్థిక కార్యకలాపాలు నిర్వహించే సంస్థలను నియంత్రించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని స్పష్టం చేశారు. అటువంటి సంస్థల వల్ల నష్టపోయిన ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలు, ప్రభుత్వ సంస్థలపై ఉందన్నారు. కూలి పనులు చేసుకునే పేదలు భవిష్యత్‌లో ఉపయోగపడతాయని, మేలైన వడ్డీ వస్తుందని ఆశతో అగ్రిగోల్డ్ సంస్థలో దేశ వ్యాప్తంగా 32లక్షల మంది డబ్బులు దాచుకున్నారని తెలిపారు. సామాజిక భద్రతలో భాగంగా సంక్షేమ పథకాల అమలు కోసం రెండేళ్లలో లక్షన్నర కోట్ల రూపాయలు అప్పు చేసిన ప్రభుత్వం… రాష్ట్రంలోని 19.5లక్షల మంది అగ్రిగోల్డ్ బాధితుల కోసం రూ.4వేల కోట్లు ఖర్చు చేయలేదా… అని ప్రశ్నించారు. సర్వం కోల్పోయి నిస్సహాయ స్థితిలో ఉన్న అగ్రిగోల్డ్ బాధితులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని ముఖ్యమంత్రికి కోరారు.
దోబూచులాట తగదు : పోతిన : ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర కన్వీనర్ పోతిన రామారావు మాట్లాడుతూ అగ్రిగోల్డ్ బాధితుల న్యాయమైన సమస్యను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం దోబూచులాడుతోందన్నారు. ఆరు నెలల్లో పూర్తిగా డిపాజిట్లు చెల్లిస్తానని చెప్పిన మాట అమలు పర్చాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఉందన్నారు. చెయ్యని వాగ్దానాలను అమలు చేస్తూ, చేసిన వాగ్దానాలను అమలుపరచకపోతే గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు.
ఆర్థిక ఉగ్రవాదులుగా ప్రకటించాలి : ముప్పాళ్ల : అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 23 రకాల డిపాజిట్ సేకరణ కంపెనీలు ఆర్థిక నేరాలకు పాల్పడ్డాయని తెలిపారు. ఇటువంటి సంస్థల బారి నుంచి ప్రజలను కాపాడేందుకు ఎప్పటికప్పుడు చట్టాలను కఠినతరం చేస్తున్నామని ప్రభుత్వాలు ప్రకటిస్తున్నా, మోసపూరిత కంపెనీల యజమానులు యథేచ్ఛగా తమ వ్యాపారాలను కొనసాగిస్తున్నారని విమర్శించారు. రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి బాధితునికి డిపాజిట్ సొమ్ము చెల్లించే వరకు పోరాటం కొనసాగించాలని, తాము అండగా ఉంటామని తెలిపారు. ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్.లెనిన్‌బాబు మాట్లాడుతూ తుది విజయం సాధించే వరకు అగ్రిగోల్డ్ బాధితులకు యువజన సమాఖ్య అండగా ఉంటుందన్నారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.రంగన్న, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సూర్యారావు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్న, ప్రజానాట్యమండలి సీనియర్ నాయకుడు ఆర్.పిచ్చయ్య పాల్గొని సంఫీుభావం తెలిపారు. అగ్రిగోల్డ్ కస్టమర్స్ అండ్ ఏజెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.తిరుపతిరావు, ఉప ప్రధాన కార్యదర్శి బీవీ చంద్రశేఖర్, శేషుకుమార్‌రెడ్డి, శేషగిరి, సుధీర్, లోవరత్నం తదితరులు పర్యవేక్షించారు.