పశ్చిమ రాయలసీమ ఎమ్మెల్సీ స్థానంలో హోరాహోరీ
తగ్గుతున్న ఓట్ల అంతరం
1300 ఓట్లకు తగ్గిన వైసీపీ ఆధిక్యం
కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ప్రస్తుతం రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు జరుగుతోంది. లెక్కింపు కొనసాగే కొద్దీ వైసీపీ, టీడీపీ మధ్య ఓట్ల తేడా తగ్గుతోంది. వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి ఆధిక్యం 1,700 నుంచి 1,300కి తగ్గింది. ఈ క్రమంలో, కీలక పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్ రెడ్డి కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు.
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 49 మంది పోటీ చేశారు. కనిష్ఠంగా ఓట్లు పొందిన అభ్యర్థుల ఓట్ల లెక్కింపు పూర్తయింది. దాంతోపాటే, 37 మంది అభ్యర్థుల రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కించడం కూడా పూర్తయింది.ఈ నేపథ్యంలో, 12 మంది అభ్యర్థులు మిగిలారు. వీరిలో… 2,26,405 ఓట్లలో 50 శాతం ఓట్లతో పాటు అదనంగా మరో ఓటు వచ్చిన అభ్యర్థి విజేతగా నిలుస్తాడు. 1,13,204 ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలిచినట్టు అధికారులు ప్రకటించనున్నారు.