Friday, March 31, 2023
Friday, March 31, 2023

ఇద్దరు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల
ఏకగ్రీవం

విశాలాంధ్ర-చిత్తూరు/నెల్లూరు:
స్థానిక సంస్థల నియోజకవర్గాలకు సంబంధించి ఉమ్మడి చిత్తూరు జిల్లా, నెల్లూరు జిల్లాల నుంచి వైసీపీ అభ్యర్థులు సిపాయి సుబ్రమణ్యం, మేరుగు మురళీధర్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ రెండు నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరించడంతో సుబ్రమణ్యం, మురళి ఎన్నిక అనివార్యమైంది. అయితే ఫలితాలను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. చిత్తూరు స్థానిక సంస్థల స్థానానికి టీడీపీ మద్దతుతో నామినేషన్‌ వేసిన స్వతంత్ర అభ్యర్థి చుక్క ధనుంజయులు తన అభ్యర్థిత్వాన్ని నిర్ధారించే పత్రాలు సకాలంలో అందజేయకపోవడంతో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి వెంకటేశ్వర్‌ ఆ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో సిపాయి సుబ్రమణ్యం ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి శ్రీకాళహస్తికి చెందిన సిపాయి సుబ్రమణ్యం వైసీపీ అభ్యర్థిగా నాలుగు సెట్ల నామినేషన్లు దాఖలు చేయగా, విజయపురం మండలానికి చెందిన జిల్లా పంచాయతీ చాంబర్‌ అధ్యక్షుడు చుక్క ధనుంజయలు రెండు సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. రిటర్నింగ్‌ అధికారి సమక్షంలో చిత్తూరులోని జిల్లా సచివాలయంలో శుక్రవారం నామినేషన్ల పరిశీలన జరిగింది. అభ్యర్థులకు సంబంధించిన మద్దతుదారులతోపాటు న్యాయవాదులు హాజరయ్యారు. సిపాయి సుబ్రమణ్యం నామినేషన్లు సక్రంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.నెల్లూరు జిల్లాకు సంబంధించి స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి మేరుగు మురళీధర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. స్వతంత్ర అభ్యర్థి నామినేషన్‌లో పొరపాట్లు ఉండటంతో రిటర్నింగ్‌ అధికారి దానిని తిరస్కరించారు. దీంతో మురళీధర్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. అనంతరం మురళి మాట్లాడుతూ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం తనకు కల్పించిన ముఖ్యమంత్రి జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి కాకాని గోవర్ధన్‌రెడ్డి, ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆదాల ప్రభాకరరెడ్డి, డాక్టర్‌ గురుమూర్తి, శాసనసభ్యులు, జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, మండల అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, వైసీపీ నేతల సహకారంతో ఏకగ్రీవంగా ఎన్నికయ్యానని చెప్పారు. సీఎం జగన్‌ నమ్మకాన్ని నిలపడానికి శాయశక్తులా కృషి చేస్తానని మురళి తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img