సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్న
విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం గుర్తింపు రద్దు చేస్తామంటూ బ్లాక్మెయిల్ చేయడం వైఎస్ జగన్ ప్రభుత్వానికి తగదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హితవు పలికారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ… సకాలంలో వేతనాలు, పెన్షన్లు చెల్లించడం లేదని, ఉద్యోగుల పెండిరగ్ బకాయిలు ఇవ్వడం లేదని ఏపీ ఉద్యోగ సంఘం నేతలు గవర్నర్కు మొరపెట్టుకున్నారని గుర్తుచేశారు. ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ చాలాసార్లు మంత్రులకు, సీఎం జగన్కు విన్నవించినప్పటికీ ఫలితం శూన్యమని తెలిపారు. దీంతో దిక్కుతోచని స్థితిలో ఉద్యోగులు తమ సమస్యలను గవర్నర్కు విన్నవించుకున్నారని పేర్కొన్నారు. గవర్నర్ వద్ద ఉద్యోగ సంఘ నేతలు తమ ఇబ్బందులు చెప్పుకున్నారు తప్ప… రాజకీయ అంశాలేవీ ప్రస్తావించలేదని తెలిపారు. ఉద్యోగుల గోడు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి, మంత్రులు పట్టించుకోకపోతే ఎవరికి చెప్పాలని ప్రశ్నించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఉద్యోగులు గవర్నర్కు విజ్ఞప్తి చేయడం నేరమా అని నిలదీశారు. ఉద్యోగసంఘం నేత కేఆర్ సూర్యనారాయణపై రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. గతంలో సీపీఎస్ రద్దు, పీఆర్సీ అమలు కోరుతూ ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆందోళన చేపట్టిన సందర్భాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను, అధికారులను ప్రయోగించి ఉక్కుపాదం మోపిందని గుర్తుచేశారు. ప్రజా నిరసనలను అణగదొక్కేందుకే జీవో నంబరు ఒకటిని అప్రజాస్వామికంగా తీసుకొచ్చిందని మండిపడ్డారు. జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు, ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తూ నిరంకుశ విధానాలు అమలు చేస్తున్నారని విమర్శించారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెల పరిష్కారం కోసం చిత్తశుద్ధి చూపాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.