Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

ఉపాధి కార్మికుల బకాయిల కోసం…

23న ప్రదర్శనలు`వినతులు

ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం పిలుపు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఉపాధి కార్మికులకు బకాయిలు తక్షణమే చెల్లించాలని, పేదల సంక్షేమ పథకాలను సక్రమంగా అమలు కోసం ఈనెల 23న గ్రామ సచివాలయాల ఎదుట ధర్నాలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం (బీకేఎంయూ) పిలుపునిచ్చింది. విజయవాడలోని తమ్మెన పోతురాజు సమావేశ మందిరంలో రాష్ట్ర జనరల్‌ కౌన్సిల్‌ సమావేశాన్ని నిర్వహించారు. దీనికి ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ జల్లి విల్సన్‌ అధ్యక్షత వహిం చారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రామకృష్ణ మాట్లాడుతూ 2014 ధరలకూ, ప్రస్తుత ధరలకూ ఏ మాత్రం పొంతన లేదన్నారు. మోదీ అధికారంలోకి వచ్చాక రైలు, ప్లాట్‌ఫారమ్‌ టికెట్ల ధరలు, పెట్రో ఉత్పత్తి ధరలను విపరీతంగా పెంచేశారన్నారు. నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటు తున్నప్పటికీ.. మౌన మునిలా మోదీ ఉంటున్నారని దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రైతు చట్టాలకు వ్యతిరేకంగాను, పెగాసస్‌పైన, అధిక ధరలను తగ్గిం చాలని అటు పార్లమెంట్‌ లోపల, బయటా చాలా ఆందోళ నలు చేసినప్పటికీ, మోదీ మౌనంగా ఉండటం విడ్డూరంగా ఉందన్నారు. కార్మికులను ఉద్యోగాల నుంచి తొలగించి, వారి పొట్టలు కొడుతున్నార న్నారు. కార్పొరేట్‌ల కోసమే మోదీ చట్టాలు తెచ్చి, రైతులను అడ్డగోలుగా మోసగిస్తున్నారని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య క్రమేపీ పెరుగుతోం దని, డిజిటల్‌క్లాస్‌ల పేరుతో పేద విద్యార్థులను చదువులకు దూరం చేస్తు న్నారని పేర్కొన్నారు. వలస కార్మికులు పొట్ట చేత పట్టుకొని, తల్లి పసిబిడ్డలు చంకన వేసుకొని రోడ్ల వెంబడి వందల కిలోమీటర్లు నడుస్తున్నప్పటికీ.. పట్టించుకున్న పాపాన పోలేదని గుర్తుచేశారు. కేంద్ర ప్రభుత్వం పక్కాగా కష్టజీవులు, పేద వాళ్లకు వ్యతిరేకంగా నడుచుకుంటున్నాయని, రాష్ట్రంలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు దాటిందని, పేదలకు సంక్షేమ కార్యక్రమాలను జగన్‌ మంచిగా చేస్తున్నారని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు కూడా అప్పులు చేశారని, ఆయన కంటే అప్పులు చేయడంలో జగన్‌ ఘనుడేనని నిరూపించుకున్నారన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధి, ఉపాధి, పారిశ్రా మిక అభివృద్ధిపై సీఎం జగన్‌ మాట్లాడంలేదని, వీటి సాధన కోసం వ్యవసాయ కూలీలు కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు.
జల్లి విల్సన్‌ మాట్లాడుతూ వ్యవసాయ రంగంలో యంత్రాలు ఇబ్బడి ముబ్బడిగా వాడకం వల్ల నష్టాలు వస్తాయని అన్నారు. వలస కార్మికులు, వ్యవసాయ కూలీల సమస్యలపైన, పక్కా గృహాల కోసం, ఉపాధి హామీ పథకంలో నిలిచిన వేతనాలు, సామాజిక అంశాలు, భూ సమస్యలు, అంటరానితనం తదితర పరిష్కారంపైన నిరంతర పోరాటాలు చేయాల్సిన అవసరముందన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75ఏళ్లు పూర్తయినప్పటికీ.. నేటికీ గ్రామీణ ప్రాంతాల్లో అంటరాని తనం ఉండడం దురదృష్టకరమని, ఈ సమస్యపై వ్యవసాయ కార్మిక సంఘం అనునిత్యం గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యమించాలని కోరారు. ఉపాధి హామీ పథకం పనులు కొనసాగ బట్టే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళల ముఖాల్లో చిరునవ్వు ఉందనేది వాస్తవమని అన్నారు. చాలామంది నిరుపేదల చేతుల్లో భూములు లేవని వారికి ఆత్మ గౌరవం పెరగాలని, అంటే భూములు దక్కాలని స్పష్టం చేశారు. సామాజిక అంశాలపై ఎప్పటికప్పుడు వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వం, కార్యకర్తలు ఉద్యమించాలన్నారు. సంక్షేమ కార్యక్రమాలు పేదలకు మరింత చేరువగా ఉండాలంటే అవినీతిని ఎప్పటికప్పుడు గమనించాలని సూచించారు.
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్‌ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ భూములు, అటవీ బంజరు, సీలింగ్‌, అసైన్డ్‌, దేవాలయ, ఈనాం భూములు లక్షలాది ఎకరాలు పంచడానికి అనుకూలంగా ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలు ముందుకు రాకపోవడం మంచిది కాదన్నారు. భూమిలేని నిరుపేదలను గుర్తించి రెండెకరాల భూమి ఇవ్వాలని కోరారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖర్‌ రెడ్డి హయాంలో వేసిన కోనేరు రంగారావు భూ కమిటీ ప్రతిపాదనలను.. సీఎం వైఎస్‌ జగన్‌ అమలు చేయాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా అసైన్మెంట్‌ కమిటీలు పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పేదలకు భూములు దక్కే దాక ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో దున్నేవాడిదే భూమి అనే నినాదంతో భూ పోరాటాలు నిర్వహిస్తూనే ఉంటామని, కార్యకర్తలు వాటికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఉపాధి హామీ పథకంలో నాలుగు వారాలుగా కూలీలు పనిచేసి, నిలిచిపోయిన కూలి డబ్బులు ఇవ్వాలని, నాలుగు లక్షల రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వమే పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని, గ్రామ సచివాలయాల ముందు ఈ నెల 23వ తేదీన ధర్నాలు నిర్వహించి వినతిపత్రాలు ఇవ్వాలని సమావేశం ప్రధానంగా తీర్మానించిందని ఆవుల శేఖర్‌ వివరించారు. తొలుత ఇటీవల వ్యవసాయ కార్మిక సంఘంలో పనిచేసి మరణించిన వారికి, కరోనాతో మృతి చెందిన వారికి సంతాపం తెలియజేస్తూ రెండు నిమిషాలపాటు సమావేశం మౌనం పాటించింది.
కరోనా సోకకుండా వ్యవసాయ కార్మిక సంఘం కార్యకర్తలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కోరుతూ సమావేశం తీర్మానిం చింది. ఈ సమావేశంలో రాష్ట్ర ఆఫీస్‌ బేరర్లు ఆర్‌.వెంకట్‌ రావు, బి.కేశవరెడ్డి, అలమండ ఆనందరావు, చిన్నం పెంచలయ్య, కాబోతు ఈశ్వర రావు, చిలుకూరు వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img