ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఫై తెలుగుదేశం, నేత నారా లోకేష్ విమర్శలు గుప్పించారు. సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ..ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు సోమవారం చలో తాడేపల్లికి పిలుపునిచ్చాయి. దీంతో పోలీసులు విజయవాడలో 144 సెక్షన్ విధించి , పోలీస్ యాక్ట్ 30 అమలు చేస్తున్నారు.దీనిపై లోకేష్ ట్విట్టర్ ద్వారా ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ‘‘ముళ్ల కంచె లోపల దాక్కునే పాలన ఇంకెన్నాళ్లు? శాంతియుతంగా నిరసన తెలపడమే నేరమంటూ యూటీఎఫ్ నేతలను, సీపీఎస్ ఉద్యోగుల సంఘం నాయకులను, ఉపాధ్యాయులను అక్రమంగా నిర్బంధించారు. మరి వారం రోజుల్లో సీపీఎస్ రద్దని మాట తప్పి మడమ తిప్పిన మిమ్మల్ని నిలదీయొద్దా జగన్ మోసపు రెడ్డి గారు? ఉపాధ్యాయుల పట్ల వైసీపీ ప్రభుత్వ నిర్బంధకాండని తీవ్రంగా ఖండిస్తున్నాను. కాకమ్మ కబుర్లతో మూడేళ్లు గడిపేశారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీ ప్రకారం సీపీఎస్ రద్దు చెయ్యండి’’ అని ట్వీట్ చేశారు.