Tuesday, August 16, 2022
Tuesday, August 16, 2022

ఎంపీ రఘురామ విచారణకు అనుమతి

న్యాయవాది సమక్షంలో ఉదయం 10 నుంచి 5 గంటల్లోపు
దిల్‌కుషా అతిథి గృహంలో విచారణ
ఆదేశాలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న హైకోర్టు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రెబల్‌ ఎంపీ రఘురామ కృష్ణరాజుపై నమోదైన సీఐడీ కేసులో విచారణకు ఏపీ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తనపై సీఐడీ నమోదు చేసిన తప్పుడు కేసులు కొట్టివేయాలని కోరుతూ నరసాపురం పార్లమెంటు సభ్యులు రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహ నేరం మినహా మిగతా సెక్షన్‌ల కింద నమోదైన కేసులకు సంబంధించి విచారించవచ్చని కోర్టు స్పష్టం చేసింది. హైదరాబాద్‌ దిల్‌కుషా గెస్ట్‌హౌస్‌లో న్యాయవాది సమక్షంలో విచారించాలని ఆదేశించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ విచారణ చేయాలని ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలు మినహా ఏ ఇతర అంశాలపై పిటిషనర్‌ను ప్రశ్నించకూడదని హైకోర్టు పేర్కొంది. సీఐడీ కార్యాలయాలకు పిలిపించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విచారణ అంతా న్యాయవాది సమక్షంలోనే జరగాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాలు ఉల్లంఘిస్తే బాధ్యులపై కఠినచర్యలు తీసుకుంటామని ఏపీ హైకోర్టు పేర్కొంది.
రఘురామ కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది. ఐపీసీ 124ఏ (రాజద్రోహం), 153ఏ, 505, 120వి సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది. దీనిపై రఘురామ తరపున బి.ఆదినారాయణరావు వాదనలు వినిపించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి వ్యక్తికి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ ఉందని, ప్రభుత్వ తీరుపై పిటిషనర్‌ తన అభిప్రాయాలు వ్యక్తం చేస్తే రాజద్రోహం కింద సీఐడీ సుమోటాగా కేసు పెట్టడం సరికాదని వాదించారు. పిటిషనర్‌ ఏదైనా పర్యటనకు సిద్ధమవుతున్న సమయంలో అడ్డుకోవడం కోసం ఉద్దేశపూర్వకంగా సీఐడీ నోటీసులిచ్చి విచారణకు హాజరు కావాలని కోరుతుందన్నారు. దీనిపై ఏజీ మాట్లాడుతూ 124ఏ మినహా మిగిలిన సెక్షన్లపై విచారణకు సహకరించడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. రాజద్రోహం చట్టాన్ని ఇటీవల సుప్రీంకోర్టు నిలుపుదల చేసిన నేపథ్యంలో పిటిషనర్‌పై ఏపీ సీఐడీ పోలీసులు నమోదు చేసిన మిగిలిన సెక్షన్ల విషయంలో విచారించడానికి హైకోర్టు అనుమతి ఇచ్చింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img