అమరావతి ఉ ఎమ్మెల్యేల కోటాలో ఖాళీ అయిన ఏడు ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ ప్రారంభమైంది. వెలగపూడిలోని తాత్కాలిక శాసనసభ ప్రాంగణంలో పోలింగ్ జరుగుతుంది. శాసనసభలో మొత్తం సభ్యుల సంఖ్య 175. ఇందులో వైఎస్సార్‌సీపీకి 151 మంది సభ్యులు ఉండగా.. టీడీపీకి అధికారికంగా 23 మంది, జనసేనకు ఒకరు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా నలుగురు సభ్యులు టీడీపీకి దూరంగా ఉంటున్నారు. దీంతో టీడీపీకి 19 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. అలాగే జనసేనకు ఉన్న ఒక సభ్యుడు కూడా ఆ పార్టీకి దూరమయ్యారు. ఒక్కో ఎమ్మెల్సీ గెలుపొందడానికి 22 మంది సభ్యుల ఓట్లు అవసరం. వైఎస్సార్‌సీపీకి స్పష్టమైన ఆధిక్యత ఉన్న నేపథ్యంలో ఏడు స్థానాలకు అభ్యర్థులను బరిలో దించింది
ఈ క్రమంలో వాస్తవంగా చూస్తే.. ఒక్క స్థానం గెలవడానికి కూడా టీడీపీకి బలం లేదు. అయినా సరే అభ్యర్థిని బరిలోకి దింపడం చర్చనీయాంశంగా మారింది. వైఎస్సార్‌సీపీలో పనితీరు ఆధారంగా కొంతమంది ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కే అవకాశం లేదని అంచనా. ఈ నేపథ్యంలో అలాంటి వారి మద్దతు కోసం టీడీపీ ప్రయత్నిస్తున్నట్లు సమాచారం