ఏపీఎస్‌ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలోని 26 జిల్లా కేంద్రాలతోపాటు 84పట్టణాలలో ఇంటింటికీ కార్గో సేవలు విస్తరిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ బస్టాండులో బుక్ చేసిన లగేజీ అవతలివారు తీసుకోవాలంటే అక్కడి బస్టాండుకే వెళ్లాల్సి వచ్చేది. సెప్టెంబరు 1 నుంచి నేరుగా ఇంటికి చేర్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. పార్సిల్ కౌంటర్ (బస్టాండ్) నుంచి 10కిలోమీటర్లలోపే ఈ సదుపాయం ఉంది. అంతకు మించి దూరంలో డెలివరీ అడ్రస్ ఉంటే సాధ్యం కాదు.
50 కేజీల బరువు వరకు బుకింగ్ చేసిన పార్సిల్, కొరియర్స్‌ను కస్టమర్ ఇంటి దగ్గరకే చేరుస్తారు. డోర్ డెలివరీ బుక్ చేయడం కోసం సమీపంలో ఉన్న బస్టాండ్‌లోని కార్గో కౌంటర్‌ను సంప్రదించాలి. కేజీకి రూ.15 నుంచి 50 కేజీల వరకు రూ.50 చెల్లించాలి. కేజీ వరకు రూ.15, కేజీ నుంచి 6 కేజీల వరకు రూ.25, 6 కేజీల నుంచి 10 కేజీల వరకు రూ.30, 10 కేజీల నుంచి 25 కేజీల వరకు రూ.40, 25 కేజీల నుంచి 50 కేజీల వరకు రూ.50 వరకు ఉండొచ్చు.