ఏపీలో చీప్ లిక్కర్ అనేదే లేదని సీఎం జగన్ అన్నారు. ఏపీ అసెంబ్లీలో మద్యం పాలసీపై స్వల్పకాలిక చర్చ జరిగిన సందర్భంగా సీఎం మాట్లాడారు. జంగారెడ్డిగూడెం మరణాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని, ప్రచారంలో ఉన్న లిక్కర్ బ్రాండ్లన్నీ చంద్రబాబు హయాంలోనివేనని సీఎం తెలిపారు.నవరత్నాలు మా బ్రాండ్స్ అయితే మద్యం బ్రాండ్లన్నీ చంద్రబాబువేనని ఆయన ఆరోపించారు. గత ప్రభుత్వం ఎన్నో మద్యం బ్రాండ్లను అనుమతి ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఆ బ్రాండ్లను మేం క్రియేట్ చేసినట్లుగా ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.చంద్రబాబు హయాంలో 254 కొత్త బ్రాండ్లు వచ్చాయని ఆయన తెలిపారు. భూం భూం, గవర్న్ చాయిస్, పవర్‌స్టార్ 999, రష్యన్ రోమానోవా ఇలాంటి వన్నీ టీడీపీ బ్రాండ్లని ఆయన ఎద్దేవే చేశారు. 2014-2019 వరకు ఏడు డిస్టలరీలకు అనుమతి ఇచ్చారని జగన్ తెలిపారు. అందుకే ఆయన ఇంటి పేరు నారా బదులు సారా అంటే సరిపోతుందని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. తమ ప్రభుత్వంలో కొత్తగా ఒక్క డిస్టలరీకి కూడా అనుమతి ఇవ్వలేదని స్పష్టంచేశారు. రాష్ట్రంలో 20 డిస్టలరీలు ఉంటే 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదేనని జగన్ పేర్కొన్నారు. బ్రాండ్ పేరు అనేది ముఖ్యం కాదన్నారు. లైసెన్స్డ్ డిస్టలరీ నుంచి వస్తోందా లేదా అన్నదే ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అనేది ముఖ్యమన్నారు.