ఏపీలో పీఆర్సీ సాధన సమితి నేతృత్వంలో ఉద్యోగసంఘాలు ఉద్యమాన్ని ఉధృతం చేసాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన పీఆర్సీ జీవోలను వెనక్కి తీసుకోవాలని ఉద్యోగులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభుత్వానికి సమ్మె నోటీసు కూడా ఇచ్చారు. నేటి నుంచి పూర్తిస్థాయి ఆందోళనలకు దిగాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు భారీ ర్యాలీలు, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉద్యోగులు ఫిబ్రవరి 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెకు వెళ్తున్న నేపథ్యంలో ఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకు సచివాలయంలో మంత్రుల కమిటీ సమావేశం కానుంది. ఈ సమావేశానికి పీఆర్సీ స్టీరింగ్ కమిటీ సభ్యులకు మంత్రుల కమిటీ ఆహ్వానం పంపింది. అయితే, మంత్రుల కమిటీ భేటీకి కూడా వెళ్లబోమని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. పీఆర్సీ జీవోల రద్దుతో పాటు మిశ్రా కమిటీ నివేదికకు బహిర్గతం చేయాలని, పాత పద్ధతిలోనే జీతాలు ఇవ్వాలని, అలా అయితేనే చర్చలకు వెళ్తామని అంటున్నారు.