మంత్రి పేర్ని నానితో ముగిసిన ఆర్జీవీ భేటీ
ఏపీలో సినిమా టికెట్ల వ్యవహారం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గత వారం నుంచి సినిమా టికెట్ రేట్ల విషయంలో ప్రశ్నలు సంధించిన ఆర్జీవీ తాజాగా ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. పేర్ని నానితో చర్చలు సంతృప్తికరంగా ముగిశాయని ఆర్జీవీ అన్నారు. ఐదు ముఖ్యమైన అంశాలపై చర్చించామని చెప్పారు. ప్రధానంగా సినిమా టికెట్ల రేట్ల తగ్గింపును ముందుగా ప్రస్తావించానని తెలిపారు. థియేటర్ల మూసివేతపై ఎలాంటి చర్చ జరగలేదన్నారు. ధరల కేటాయింపుపై ఎవరికీ అధికారం ఉండకూడదన్నారు. సినీ రంగంతో తనకున్న 30 ఏళ్ల అనుభవంతో ఎక్కడ ఏం జరుగుతుందన్న విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకొచ్చానని అన్నారు. ఆయన కూడా కొన్ని విషయాలను తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. వాటిని మా సినిమా రంగానికి చెందిన వారితో కలిసి చర్చిస్తాను. ఇదొక పద్ధతి ప్రకారం చేస్తాం. అందరికీ పరిష్కారం లభిస్తుందని భావిస్తున్నానని చెప్పారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను తగ్గించిదనే వాదనతో తాను ఏకీభవించనని అన్నారు. అయితే ప్రభుత్వ నిర్ణయం స్టార్‌లందరిపైనా, అన్ని సినిమాలపైనా ప్రభావం చూపుతుందన్నారు. కేవలం పవన్‌కల్యాణ్, బాలకృష్ణను టార్గెట్ చేయడానికి ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని తాను అనుకోవడం లేదన్నారు. టికెట్ ధరల తగ్గింపు విషయంలో విపులంగా అన్నీ వివరించాను. కేవలం ఒక్క చర్చతోనే టికెట్ రేట్ల తగ్గింపు అంశం ముగిసిపోదన్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీ అంటే తానొక్కడినే కాదని..వందలాదిమంది ఉన్నారని అన్నారు. వాళ్లందరి అభిప్రాయాలను ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. తాను సినిమా ఇండస్ట్రీ తరపున రాలేదన్నారు. ఒక సినిమా నిర్మాత మాత్రమే ఇక్కడ చర్చించడానికి వచ్చానని అన్నారు. ఎవరైతే సినిమా తీశారో వాళ్లే టికెట్ రేటు నిర్ణయించుకునే అధికారం ఇవ్వాలని అన్నారు. సమస్య పరిష్కారం అనేది సినిమా ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇద్దరి పైనా ఉందన్నారు.