Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలి

ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: వైద్యారోగ్యశాఖలో అన్ని విభాగాల ఒప్పంద ఉద్యోగులను క్రమబద్దీకరించాలని, పొరుగు సేవల సిబ్బందిని ఒప్పంద విధానంలోకి మార్చాలని, నిబంధనలకు మేరకు వేతనాలివ్వాలని ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) డిమాండ్‌ చేసింది. వైద్యారోగ్యశాఖ ముఖ్య అధికారులు, ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ యూని యన్‌ నేతలతో సోమవారం సంయుక్త సమావేశాన్ని నిర్వహించారు. ఈ నేపధ్యంలో ఉద్యోగుల సమస్యలపై చర్చించారు. ఈ సమావేశానికి యూనియన్‌ ప్రతినిధులుగా రాష్ట్ర అధ్యక్షుడు వి.బాలయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.గిరిబాబు, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలరాజు నాయుడు, రాష్ట్ర కోశాధికారి సాయి సత్యనారాయణ, రాష్ట్ర ఉపాధ్యక్షులు లక్ష్మణ్‌ మూర్తి, కోన అప్పారావు, రాష్ట్ర కార్యదర్శి చిన్నయ్య తదితర నాయకులు హాజరై సమస్యల్ని వివరించారు. దీనిపై వైద్యారోగ్యశాఖాధికారులు మాట్లాడుతూ, ఒప్పంద ఉద్యోగుల క్రమబద్దీకరణ అంశం పరిశీలిస్తున్నా మన్నారు. ల్యాబ్‌ టెక్నిషియన్లు, ఫార్మాసిస్టులకు పదోన్నతుల అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ నాయకులకు బదిలీల్లో మినహాయింపు ఇవ్వాలని యూనియన్‌ నేతలు కోరారు. ఔషధ నిపుణులకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకం ఇవ్వాలని, రేడియో గ్రాఫర్లకు అన్ని ప్రాంతీయ, జిల్లా, బోధనా ఆస్పత్రుల్లో చీఫ్‌ రేడియో గ్రాఫర్‌ పోస్టు మంజూరు చేయాలన్నారు. సీపీఎస్‌ రద్దు చేసి, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని, రాష్ట్రంలోని ఐదుజిల్లా ఆస్పత్రులను వైద్యారోగ్యశాఖ సంచాలకుల కార్యాలయంలో కలిపే విషయంలో అనుభవం కలిగిన ఉద్యో గులకు అన్యాయం లేకుండా చూడాలన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో 14కేడర్‌ను పాత విధానంలోనే కొనసాగించాలని, ఆస్పత్రుల్లో పనిచేసే సిబ్బందికి బయోమెట్రిక్‌ విధానం తొలగించాలన్నారు. ఎఫ్‌ఎన్‌ఓ, ఎంఎన్‌ఓ, స్టాఫ్‌నర్స్‌ తదితర సిబ్బందికి అదనపు హెచ్‌ఆర్‌ఏ, నైట్‌ డ్యూటీ, దోబి అలవెన్స్‌ ఇవ్వాలని కోరారు. పారిశుద్ధ్య భద్రతా సిబ్బందికి 549ఉత్తర్వుల ప్రకారం రూ.16వేల వేతనం, పీఎఫ్‌, ఈఎస్‌ఐ చెల్లించాలని చర్చించారు. వాటిపై వైద్యారోగ్యశాఖ అధికారులు సానుకూలంగా స్పందించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img