Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

ఓట్ల కోసమే బీజేపీ అల్లూరి జపం

గిరిజన హక్కుల కోసం పోరాడిన వీరుడు అల్లూరి
అల్లూరిని ఒక కులానికి పరిమితం చేయడం సిగ్గుచేటు
సీతారామరాజు స్ఫూర్తితో సమరశీల పోరాటాలు సాగిస్తాం
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ
విజయవాడలో అల్లూరి విగ్రహానికి వామపక్షాల ఘన నివాళి

విశాలాంధ్ర`విజయవాడ: బీజేపీ ఓట్ల కోసమే మన్యం వీరుడు, ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు జపం చేస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా వామపక్షాల అధ్వర్యాన సోమవారం విజయవాడలోని బుడమేరు వంతెన వద్ద ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు. రామకృష్ణ మాట్లాడుతూ గిరిజనుల హక్కులు, దేశ స్వాతంత్య్రం కోసం అల్లూరి సీతారామరాజు అలుపెరగని పోరాటం సాగించారని, బ్రిటీష్‌ వారిని గడగడలాడిరచారని కొనియాడారు. అటువంటి పోరాటయోధుడిని బీజేపీ తన ఓటు బ్యాంకు రాజకీయం కోసం ఒక కులానికి పరిమితం చేయడం సిగ్గుచేటన్నారు. అటవీ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టేందుకు గిరిజనులను అడవి నుంచి తరిమివేస్తూ, వారి హక్కులను కాలరాస్తున్న బీజేపీకి అల్లూరి పేరు చెప్పే అర్హత లేదన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాజుల ఓట్ల కోసం, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ వైసీపీ నుంచి గెలుపొంది రెబల్‌గా మారిన ఎంపీ రఘురామకృష్ణరాజు కోసం భీమవరం వెళ్లారని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రికి గిరిజనులకు, ఆంధ్రప్రదేశ్‌కు మేలు చేయాలనే ఆలోచన లేదన్నారు. ప్రధానమంత్రికి చిత్తశుద్ధి ఉంటే విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటీకరణను నిలిపివేస్తామని, ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు అమలు చేస్తామని, వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని, రాజధానికి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, కేంద్ర ప్రభుత్వ సంస్థల ఏర్పాటుకు సహకరిస్తామని ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర అభివృద్ధిపై ముఖ్యమంత్రికి తపన ఉంటే అల్లూరి స్ఫూర్తితో ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రధానమంత్రిని ప్రశ్నించాలన్నారు. దేశాన్ని, గిరిజనుల హక్కులు కాపాడుకునేందుకు అన్ని వామపక్షాలు, ప్రజాసంఘాలను కలుపుకొని సమరశీల పోరాటాలు సాగిస్తామని చెప్పారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల విగ్రహాలకు పూలమాల వేసే హక్కు బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ నాయకులకు లేదన్నారు. స్వాతంత్య్ర పోరాట సమయంలో బ్రిటీష్‌ సామ్రాజ్యవాదులకు అనుకూలంగా వ్యవహరించారని, ఇప్పుడు కూడా పెట్టుబడిదారులకు అనుకూలంగా వ్యవహరిస్తూ దేశాన్ని తాకట్టు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, ప్రజానాట్యమండలి రాష్ట్ర కోశాధికారి ఆర్‌.పిచ్చయ్య, సీపీఐ విజయవాడ నగర కార్యవర్గ సభ్యుడు కేవీ భాస్కర్‌రావు, నాయకులు ఎం.రవికుమార్‌, ఎస్‌కే సుభానీ, కె.రామరాజు, ఎల్‌.శివకుమార్‌, లక్ష్మయ్య, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ నాయకులు పోలారి, మునిశంకర్‌, రవిచంద్ర, పద్మ, దుర్గ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img