తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బోర్డులో ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రత్యేక ఆహ్వానితుల జీవోపై హైకోర్టు గతంలో స్టే ఇచ్చిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. జీవోపై స్టే కొనసాగుతున్నా అదే అంశంపై ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చిందన్నారు. దీనిపై స్పందించిన హైకోర్టు ఏదేనీ విషయంపై కోర్టులో విచారణ జరుగుతుండగా.. దానిపైనే ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని ప్రశ్నించింది. ఇలా చేసిన ఏపీ సర్కారుపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను మార్చి 11కు వాయిదా వేసింది. అదే రోజున ప్రత్యేక ఆహ్వానితుల విషయంపై తుది విచారణ జరిగే అవకాశాలున్నాయి.